Begin typing your search above and press return to search.

పుట్టని ఫ్రంట్ కి... కండిషన్స్ అప్లై...?

By:  Tupaki Desk   |   22 Feb 2022 3:30 PM GMT
పుట్టని ఫ్రంట్ కి...  కండిషన్స్ అప్లై...?
X
ఇంకా పుట్టలేదు, పేరు పెట్టలేదు, కానీ హడావుడి మాత్రం వీర లెవెల్ లో ఉంది. దేశంలో అధికారాన్ని చేపట్టడానికి ఎన్ని సీట్లు అవసరమవుతాయో అన్న లెక్క లేదు, మన దగ్గర ఎందరు ఎంపీలు ఉన్నారు అన్న సోయి కూడా లేదు. డైరెక్ట్ గా ప్రధాని సీటుకే గేలం వేసేస్తున్నారు రాజకీయ ఆత్రగాళ్ళు. నిజానికి పీఎం సీటు అంటే అంత ఆషామాషీగా ఉన్నదా అన్నదే ప్రశ్న. లోక్ సభలో 543 సీట్లు ఉన్నాయి. ఏ పార్టీ అయినా లేక ఏ కూటమి అయినా మెజారిటీ తెచ్చుకోవాలంటే 272 సీట్లు రావాలి. మరి ఈ రోజు పార్లమెంట్ లో సింగిల్ డిజిట్ ఉన్న పార్టీలు కూడ పీఎం పోస్ట్ మాదే అంటున్నాయంటే దీన్ని ఏమనుకోవాలో.

ఇదిలా ఉంటే మమతా బెనర్జీ గత ఏడాది పశ్చిమ బెంగాల్ సీఎం గా మూడవ సారి గెలిచాక కొన్ని నెలల పాటు దేశంలో హల్ చల్ చేశారు. మోడీకి తానే అసలైన ప్రత్యర్ధిని అని చాటుకున్నారు. మోడీ ఇలా సీటు ఖాళీ చేస్తే అలా తాను పీఎం అయిపోవడమే అన్నంతగా హడావుడి చేశారు. ఆమె కూడా అలుపెరగకుండా ఢిల్లీ టూర్లు చేశారు.

దేశంలోని అపోజిషన్ లీడర్లకు లేఖలు రాశారు. మోడీకి యాంటీగా పనిచేయడానికి ముందుకు రండి అని అన్నారు. ఇలా శివసేన నాయకులు, శరద్ పవార్ వంటి నేతలతో భేటీలు వేశారు, ఇపుడు ఆమె కొంత తగ్గి ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆమె గమ్మున ఉన్నారు. సరిగ్గా ఈ టైమ్ లో కేసీయార్ బయల్దేరారు. ఆయన మోడీని దించేస్తామని అంటున్నారు.

మోడీ మీద మమత యుద్ధం ప్రకటించారూ అంటే ఆమెకు సొంతంగా పార్లమెంట్ లో 22 మంది ఎంపీలు ఉన్నారు. అదే టీయారెస్ కి ఉన్నవి కేవలం 9 సీట్లు మాత్రమే. ఇక మమత ఎక్కే గడపా దిగే గడపా అంటూ బిజీగా తిరిగేశాక ఇపుడు కేసీయార్ కూడా అవే గుమ్మాల్లోకి వెళ్ళారు. ఉద్ధవ్ థాకరేతో ఆయన కూడా భేటీ అయ్యారు. శరద్ పవార్ తో ముచ్చట్లు పెట్టారు.

ఇదిలా ఉంటే శివసేన పార్టీకి చెందిన కీలక నేత, రాజ్యసభ మెంబర్ సంజయ్ రౌత్ అయితే ఫ్రంట్ మీద తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. ఏ ఫ్రంట్ అయినా కాంగ్రెస్ తో కలసి పనిచేయాల్సిందే అని కుండబద్ధలు కొట్టారు. తాము మమతా బెనర్జీ వచ్చినపుడూ అదే చెప్పామని, కేసీయార్ కి అదే తెలియచేశామని అంటున్నారు.

నిజానికి శివసేన సర్కార్ లో కాంగ్రెస్ కూడా భాగస్వామ్యంగా ఉంది. రేపటి రోజున కేంద్రంలో యూపీయే త్రీ సర్కార్ ఏర్పాటు కావాలన్నదే శివసేన కోరికగా ఉంది మరి. కేసీయార్ చెబుతున్న ఫ్రంట్ అయితే కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, ప్రాంతీయ పార్టీలు ఇతర జాతీయ పార్టీల సమ్మేళనం అని అంటున్నారు.

కేసీయార్ కి తెలంగాణాలో ఈ రోజుకీ కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. టీయారెస్ మీద వెగటు పుడితే అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ మాత్రమే. అలాంటి పార్టీ కేసీయార్ తో కలుస్తుందా. ఒకవేళ అనుకున్నా కేసీయార్ అయినా కలవగడానికి తెలంగాణా రాజకీయం ఒప్పుకుంటుందా.

ఇప్పటికి రెండు దఫాలుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ తెలంగాణానే కాదు, జాతీయ రాజకీయాన్ని కూడా కేసీయార్ కి అప్పగించేసి చడీ చప్పుడు చేయకుండా ఉంటుందా. ఇవన్నీ కూడా చర్చలే. ఇవన్నీ కూడా సందేహాలే. ఇక కేసీయార్ తెలంగాణా ఇస్తే టీయారెస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని ఆనాడు హామీ ఇచ్చి మాట తప్పారన్న గుర్రు హై కమాండ్ లో ఎటూ ఉంది. ఇవన్నీ చూస్తూంటే కేసీయార్ తలచిన ఫ్రంట్ పుట్టకముందే అనేక కండిషన్లు డౌట్లతో ఉందనే అర్ధమవుతోంది.

ఇంతకీ వచ్చే ఎన్నికల్లో టీయారెస్ యాంటీ ఇంకెబెన్సీని తట్టుకుని తెలంగాణాలో ముచ్చటగా మూడవసారి గెలిచే సీన్ ఉందా అన్నదే పెద్ద ప్రశ్న. అంతే కాదు 2019లో వచ్చిన తొమ్మిది ఎంపీ సీట్లు కూడా ఈసారి వస్తే గొప్పే అని విపక్షాలు అంటున్న వేళ కేసీయార్ జాతీయ వంటకం ఎలా పండుతుంది అంటే గులాబీ బాస్ ఊహాలోకం లోకి వెళ్ళి అక్కడ వెండి తెర మీద చూడాల్సిందే అంటున్నారు.