Begin typing your search above and press return to search.

కమలనాథులకు చెమటలు పట్టేలా రౌత్ నోట కీలక వ్యాఖ్య

By:  Tupaki Desk   |   1 Nov 2019 6:41 AM GMT
కమలనాథులకు చెమటలు పట్టేలా రౌత్ నోట కీలక వ్యాఖ్య
X
గాలి వాటంగా లేనప్పుడు తల వంచితే పోయేదేమీ లేదు. నేనేంటి?. తల దించటం ఏమిటన్న తీరు కొన్నిసార్లు తలనొప్పులకే కాదు.. అసలుకే ఎసరు వచ్చేలా చేస్తుంది. తాజాగా మహారాష్ట్ర రాజకీయం ఇదే రీతిలో మారిందని చెప్పాలి. బీజేపీ-శివసేన కూటమికి స్పష్టమైన మెజార్టీని మహా ఓటర్లు కట్టబెట్టినప్పటికి.. సీఎం పీఠాన్ని ఎవరే చేపట్టాలన్న విషక్ష్ం మీద రెండు వర్గాల మధ్య నెలకొన్న పోరు.. విషయాన్ని ఒక కొలిక్కి రాకుండా చేస్తోంది. అంతేకాదు.. కొత్త తరహా రాజకీయాలకు తెర తీసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈసారి ప్రభుత్వ ఏర్పాటుతో శివసేన కీలకం కావటం.. అనుకున్న దాని కంటే బీజేపీకి దాదాపు 20కి పైగా సీట్లు తక్కువ వచ్చిన నేపథ్యంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి. అయినప్పటికీ ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయాలని.. తమ పార్టీకి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉండాలన్న పట్టుదలతో ఉంది బీజేపీ. ఇందుకు శివసేన ససేమిరా అంటోంది.
ఎన్నికల ఫలితాలు వెలువడి వారం దాటుతున్నా.. మహారాష్ట్ర రాజకీయం ఒక కొలిక్కి రాలేదు. ఇదిలా ఉంటే.. అనూహ్య పరిణామం ఒకటి నిన్న (గురువారం సాయంత్రం) చోటు చేసుకుంది. ఎన్సీపీ నేతలతో భేటీ అయ్యారు శివసేన నేతలు. ఇదిలా ఉంటే.. తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్య ఒకటి చేశారు.

ఇంతకాలంఆయన నోటి నుంచి ఈ తరహాలో ప్రకటన వచ్చింది లేదు. బీజేపీ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా తమకు ఉందన్న మాట శివసేన చేసింది. శివసేన నాయకుడే మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అవుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని తేల్చేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను ఆయన నివాసంలో కలుసుకున్న తర్వాత రౌత్ మాటల్లో ఆత్మవిశ్వాసం వెల్లివిరియటంతో పాటు తమ పార్టీ నేతే సీఎం అన్న మాటను ఆయన స్పష్టంగా చెబుతున్నారు. రౌత్ నోటి నుంచి వచ్చిన మాట మోడీషాలను ఉలిక్కిపడేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.