Begin typing your search above and press return to search.

పీవీ సీల్డ్ కవర్ ప్రధాని ఎంతమాత్రం కాదంట

By:  Tupaki Desk   |   22 Jun 2016 7:12 AM GMT
పీవీ సీల్డ్ కవర్ ప్రధాని ఎంతమాత్రం కాదంట
X
ఈ రోజు భారతదేశం ఆర్థికంగా బలమైన దేశంగా.. వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉందంటే దానికి కారణం దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మాత్రమే. అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం మూస విధానాల్ని వదిలేసి.. స్వేచ్ఛ వాణిజ్యంలోకి అడుగు పెట్టేందుకు ఇనుప గొలుసుల్లాంటి నిబంధనల్ని సడలించి.. సరళీకృత ఆర్థిక వ్యవస్థే భారతదేశ ఆర్థిక పురోభివృద్ధికి మార్గమని నమ్మటమేకాదు.. దాన్ని అనుసరించిన పీవీకే ఈ క్రెడిట్ అంతా దక్కుతుంది. ఈ సందర్భంగా పీవీ నరసింహారావుకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు ప్రముఖ పాత్రికేయుడు సంజయ బారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన ఆయన.. ఒక చర్చాగోష్టిలో పాల్గొన్న సందర్భంగా పీవీ నరసింహరావు నామినేటెడ్ ప్రధాని ఎంతమాత్రం కాదని.. ఆయన నేతలు ఎన్నుకున్న ప్రధాని అన్న విషయాన్ని స్పష్టం చేయటమే కాదు.. అందుకు సంబంధించిన ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు.

‘‘తాను ప్రధాని పదవికి పోటీలో ఉన్నట్లు1991 మే 19న శరద్ పవార్ ప్రకటించారు. అర్జున్ సింగ్ కూడా రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో పీవీ కూడా బరిలోకి దిగారు. మెజారిటీ ఎంపీలు దక్షిణాది నుంచి ఉండటంతో పాటు.. పీవీకి ఒడిశా.. బెంగాల్ కు చెందిన ఎంపీలు మద్దతు పలకటంతో ఆయన్ను ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పవార్ కు మహారాష్ట్ర ఎంపీల మద్దతు మాత్రమే లభిస్తే.. అర్జున్ సింగ్ కు ఉత్తరాది ఎంపీల్లో కొందరు ఆయన్ను బలపర్చారు. అందుకే పీవీని నామినేటెడ్ ప్రధానిగా ఎంతమాత్రం చెప్పలేం. ఆయన నేతలు ఎన్నిక ద్వారా ఎంపికైన ప్రధాని’’ అంటూ చెప్పారు. ఢిల్లీ స్థాయిలో ఉత్తరాది వారి బలం పైచేయిగా ఉన్నప్పటికీ ఒక దక్షిణాది ప్రాంతానికి వ్యక్తి.. అందులో ఒక తెలుగువాడు తన సత్తా చాటటం గ్రేట్ కదూ.