Begin typing your search above and press return to search.

పీవీకి భారతరత్న..?

By:  Tupaki Desk   |   23 Jun 2016 4:50 AM GMT
పీవీకి భారతరత్న..?
X
భారత మాజీ ప్రధాని - తెలుగు తేజం - దివంగత పీవీ నరసింహారావుకు భారత రత్న దక్కనుందా! అంటే అవుననే సంకేతాలు వినబడుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆయన చేసిన కృషికి ఫలితంగా ఎన్డీయే ప్రభుత్వం పీవీకి అరుదైన గౌరవాన్ని అందించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన పీవీ దేశాన్ని పాలించినా ఆయన విషయంలో ఆ పార్టీ అనుసరించిన వైఖరిపై అనేక విమర్శలున్నాయి. చివరికి పీవీ మరణానంతరం కూడా అగౌరవపరిచారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పీవీకి బీజేపీ ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ఇవ్వడం కాంగ్రెస్ కు చెంప దెబ్బ కొట్టినట్లవుతుందని భావిస్తున్నారు.

అయితే... పీవీకి భారత రత్న ఇస్తారన్న అంచనాలపై బీజేపీ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ... కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వద్ద మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు ఈ అంచనాలు వేస్తున్నారు. యాక్సిడెంటర్ పీఎం అంటూ మన్మోహన్ పై పుస్తకం రాపి సంచలనం రేపిన సంజయ్ బారు పీవీకి భారతరత్న వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై అధ:పాతాలానికి వెళ్లే సమయంలో పీవీ చేసిన సంస్కరణలు - పనులతో ఆర్థికంగా వృద్ధి చెందినందుకుగానూ ఆయనకు అత్యున్నత పురస్కారం ఇచ్చే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు.

మన్మోహన్ తో కలిసి పనిచేసిన బారు ఆయనకు వ్యతిరేకంగా ఎండగడుతూ పుస్తకాలు రాయగా... ప్రస్తుతం పీవీని మాత్రం ఆకాశానికెత్తేస్తున్నారు. పీవీ దేశానికి చేసిన సేవలు ఎనలేనివని చెప్పారు. పీవీ నాయకత్వ లక్షణాలతోనే కాంగ్రెస్‌ ఎంపీలు 1991లో ఆయన్ను ప్రధానిగా ఎన్నుకున్నారని, నామినేషన్‌ తో కాదని స్పష్టం చేశారు. కాగా పీవీ విషయంలో కాంగ్రెసేతర పార్టీలు సానుకూలంగా స్పందిస్తున్న తరుణంలో ఇది నిజమైనా కావొచ్చన్న వాదన వినిపిస్తోంది. పీవీని తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం - టీఆరెస్ పార్టీ కూడా తెలంగాణ బిడ్డగా గౌరవిస్తోంది. ఇదే పద్ధతిలో బీజేపీ కూడా దేశానికి సంస్కరణల దారి చూపిన దార్శినికుడిగా పీవీకి అత్యున్నత పురస్కారంతో గౌరవించినా ఆవ్చర్యపోనవసరంలేదు.