Begin typing your search above and press return to search.

గోదారోళ్ల మజాకానా: కాబోయే అల్లుడికి 365 రకాలతో సంక్రాంతి విందు

By:  Tupaki Desk   |   17 Jan 2022 5:34 AM GMT
గోదారోళ్ల మజాకానా: కాబోయే అల్లుడికి 365 రకాలతో సంక్రాంతి విందు
X
మర్యాదకు పెట్టింది పేరుగా చెబుతారు గోదారోళ్లను. ఆ మధ్యన తన కుమార్తెను అత్తారింటికి పంపే సమయంలోనూ ఒక పెద్ద మనిషి పంపిన సారె సైజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. కొత్త కల్చర్ కు తెర తీసింది. వియ్యంకుల వారి మర్యాదతో ఖుషీ అయిన అబ్బాయి వారు.. ఆ తర్వాత అంతకు మించి అన్న రీతిలో రిటర్న్ గిఫ్టును భారీగా ప్లాన్ చేయటంతో మరోసారి వార్త అయ్యింది. ఇవన్నీ పాత కబుర్లు. తాజాగా.. సంక్రాంతి పండక్కి కాబోయే అల్లుడికి తమదైన శైలిలో పండుగ మర్యాద చేసిన వైనం ఇప్పుడు వైరల్ గా మారింది.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాధవి.. వెంకటేశ్వరరావుల కుమార్తె పేరు కుందవి. ఆమెకు.. తణుకుకు చెందిన సాయి క్రిష్ణతో పెళ్లి ఫిక్స్ అయ్యింది. పెళ్లికి ఇంకా టైం ఉండటం.. అంతలోనే సంక్రాంతి పండుగ రావటంతో.. కాబోయే అల్లుడ్ని మర్యాదపూర్వకంగా ఇంటికి భోజనానికి పిలిచారు. అయితే.. ఈ విందు తమ ఇంట్లో కాకుండాకుందవి అమ్మమ్మ.. తాతయ్యల ఊరైన నరసాపురంలో ఏర్పాటు చేశారు.

పండక్కి పెద్ద వాళ్లు ఇంటికి భోజనానికి రావాలని గట్టిగా చెప్పటంతో కాదనలేకపోయిన పెళ్లి కొడుకు వారింటికి భోజనానికి వెళ్లారు.కాబోయే భార్యతో పండుగ వేళ సరదాగా గడిపే వేళలో.. భారీ సర్ ప్రైజ్ ఇచ్చారు సాయి క్రిష్ణకు. భోజనానికి అక్షరాల 365 రకాలతో భారీ విందు భోజనాన్ని సిద్ధం చేసిన వైనం అందరిని ఆకర్షించటమే కాదు.. అదో ఆసక్తికర వార్తగా మారింది. గోదారోళ్లకు మర్యాద ఎక్కువ అన్న మాటకు నిదర్శనంగా ఈ విందు నిలిచింది.

ఈ విందు కోసం 100 రకాల మిఠాయిలు.. 19 రకాల హాట్లు.. 15 వెరైటీలతో ఐస్ క్రీంలు.. 35 రకాల డ్రింకులు.. 35 రకాల బిస్కెట్లతో పాటు.. 15 వెరైటీల కేసులతో కలిపి మరో 30 రకాల కూరలు.. వివిధ పిండి వంటలు చేసి భారీ డైనింగ్ టేబుల్ మీద పొందిగ్గా సర్దేసి.. భోజనానికి పిలిచారు. ఆ భారీ విందు భోజనం చూసిన కాబోయే పెళ్లి కొడుకు అవాక్కు అయ్యారు. తన జీవితంలో మర్చిపోలేని విందును పెళ్లికి ముందే రుచి చూశారు.

ఈ భారీ విందు విషయం ఆ నోటా.. ఈ నోటా పాకి మీడియా వారికి చేరటం.. వారు ఫోటోలు తీసి.. వీడియోల్ని టెలికాస్ట్ చేయటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంక్రాంతి విందు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోసారి.. గోదారోళ్ల మర్యాద అంటే ఎలా ఉంటుందన్నది అందరికి తెలిసేలా చేశారని చెప్పక తప్పదు.