Begin typing your search above and press return to search.

సంక్రాంతి పండక్కి ఏపీ మందుబాబులకు కిక్కు ఎక్కించే ఆఫర్

By:  Tupaki Desk   |   16 Jan 2023 3:29 AM GMT
సంక్రాంతి పండక్కి ఏపీ మందుబాబులకు కిక్కు ఎక్కించే ఆఫర్
X
తెలుగు ప్రజలు పెద్ద పండుగగా భావించే సంక్రాంతి వేళ.. మందుబాబులకు కిక్ ఎక్కించే ఆఫర్ ను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. మాట మీద నిలబడే వంశంగా తరచూ చెప్పుకునే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విపక్ష నేతగా ఉన్నప్పుడు పదే పదే ఆయన నోటి నుంచి ఒక మాట వినిపించేది. తాము అధికారంలోకి వస్తే.. మద్యనిషేధాన్ని క్రమపద్దతిలో చేపడతామని.. తాము అధికారంలో ఉన్న రోజుల్లో పాక్షిక మద్యనిషేధాన్ని అమలు చేస్తామంటూ చెప్పిన మాటు అన్ని ఇన్ని కావు.

ఎన్నికల మేనిఫేస్టోలోనూ ఇదే తరహాలో మాటలు చెప్పటం తెలిసిందే. ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినంతనే.. రాష్ట్రంలోని మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే చేస్తుందంటూ కబ్జా చేయటం.. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికి తెలిసిందే. భారీగా ధరలు పెంచేయటం.. ప్రపంచంలో ఎక్కడా దొరకని సిత్రమైన బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చేసి.. వాటితో కాసుల పంట ఎలా పండించారో తెలిసిందే.

తమ ఎక్సైజ్ పాలసీ జనాల చేత మద్యం తాగించేలా కాకుండా వారి వినియోగం తగ్గించేలా చేస్తామని చెప్పిన జగన్.. చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. అమ్మకాల్ని పెంచుకునేందుకు వీలుగా ప్రత్యేక రోజుల్లో అంటే.. డిసెంబరు 31, జనవరి 1 లాంటి రోజుల్లో మద్యం దుకాణాల్ని మామూలు కంటే అదనంగా కొన్ని గంటల పాటు షాపుల్ని తెరుచుకునేలా చేసి.. వారికి మద్యాన్ని అందుబాటులోకి ఉంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు.

తాజాగా సంక్రాంతి సందర్భంగా ఇదే తీరును ప్రదర్శించింది. మూడు రోజుల పెద్ద పండక్కి.. మూడు రోజులు కాకుండా నాలుగు రోజుల పాటు మద్యం అమ్మకాల సమయాన్ని మార్చారు. సాధారణంగా ఉదయం11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మద్యాన్ని విక్రయించే స్థానంలో జనవరి 13 నుంచి 16 వరకు రాత్రి వరకు మద్యం అమ్మకాల్ని ఒక గంట పాటు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఆదేశాల్ని జారీ చేశారు. మాట మీద నిలబడే జగన్.. మద్యం అమ్మకాల విషయంలో ఇలాంటి నిర్ణయాల్ని తీసుకోవటంలో అర్థమేందంటారు?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.