Begin typing your search above and press return to search.

ఉద్యొగులకు సంక్రాంతి కానుక రెడీ... ?

By:  Tupaki Desk   |   5 Jan 2022 10:47 AM GMT
ఉద్యొగులకు సంక్రాంతి కానుక రెడీ... ?
X
సంక్రాంతి వచ్చిందంటే సంబరాలు తేవాల్సిందే. అయితే కొన్ని వర్గాలకు మాత్రం ఇంకా తీరని కోరికలు ఉన్నాయి. దాంతో వారు ఈ సంక్రాంతి తరువాత సమరానికి సిద్ధపడుతున్నారు. వారే ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు. పదమూడు లక్షల మంది దాకా ఉన్న ఉద్యోగులు జగన్ సర్కార్ వైఖరి మీద గుర్రు గా ఉన్నారు. తమను ప్రతీసారీ ప్రభుత్వ పెద్దలు మభ్యపెడుతున్నారు తప్ప అసలు తమ డిమాండ్లు పట్టించుకోవడంలేదని వారు మండిపోతున్నారు.

ప్రభుత్వ సలహదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి హామీతో నాడు నిరసనలు విరమించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు ఇపుడు తప్పు చేశామని భావిస్తున్నారు. దాంతో వారు మళ్లీ ఉద్యమ బాటలోకి వెళ్లాలని చూస్తున్నారు. దీంతో జగన్ సర్కార్ కూడా అలెర్ట్ అయింది. ఉద్యోగుల విషయంలో ఏదో ఒకటి తేల్చాలనుకుంటోందిట. ఇప్పటికే పలుమార్లు పీయార్సీ మీద చర్చలు జరిగాయి. ఉద్యోగ వర్గాలు 40 నుంచి యాభై శాతం ఫిట్ మెంట్ కోరుతున్నారు. ప్రభుత్వం అయితే అంత ఇవ్వలేమని అంటోంది.

దాంతో అక్కడే పీటముడి పడిపోతోంది. దీంతో ఈ విషయాన్ని ఎలాగైనా సామరస్యంగా పరిష్కరించాలని జగన్ చూస్తున్నారని తెలుస్తోంది. అటు ఉద్యోగులు కోరుతున్నట్లుగా కాకుండా ఇటు తాము మొదట చెప్పినట్లుగా కాకుండా మధ్యేమార్గంగా 30 శాతం దాకా ఫిట్ మెంట్ ని ఇవ్వాలని ప్రభుత్వం ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఒక విధంగా ఉద్యోగవర్గాలు కూడా దీనికి అంగీకరించవచ్చు అంటున్నారు.

అయితే డీఏల బకాయిలు, ఇతర ఆర్ధిక పరమైన డిమాండ్ల విషయంలో మాత్రం ఎక్కడా తగ్గకూడదని వారు భావిస్తున్నారుట. మొత్తానికి ఉద్యోగులకు పీయార్సీ ప్రకటించి వారికి సంక్రాంతి కానుకను ప్రకటించాలని జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని టాక్. అయితే పీయార్సీని ఎపుడు అమలు చేస్తారు అన్నదే చూడాలి. ఏది ఏమైనా ఉద్యోగ వర్గాలు ఆందోళనాపధంలోకి వెళ్లకుండా చూడాలని వైసీపీ ఎట్టకేలకు గ్రహించడం, పెద్దలలో వేడి పుట్టడంతో పీయార్సీ ప్రకటన కోసం ఉద్యోగులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మీరకు జగన్ ఢిల్లీ నుంచి వచ్చీ రావడంతోనే అధికార వర్గాలతో పీయార్సీ మీద సమీక్ష జరపడంతో ఆశావహ వాతావరణం అయితే కనిపిస్తోంది. అన్నీ అనుకూలిస్తే ఒకటి రెండు రోజుల్లోనే పీయార్సీ మీద ప్రభుత్వ ప్రకటన ఉంటుంది అంటున్నారు.