Begin typing your search above and press return to search.

కోడి పందెం అంటే క‌ఠిన చ‌ర్య‌లేనంట‌!

By:  Tupaki Desk   |   7 Jan 2016 2:05 PM GMT
కోడి పందెం అంటే క‌ఠిన చ‌ర్య‌లేనంట‌!
X
మంచి చెడులు.. న్యాయం అన్యాయం.. లాంటి మాట‌ల‌కు సంబంధించి జ‌నాభిప్రాయం ఒక‌లా ఉండ‌టం.. చ‌ట్టం మ‌రోలా చెప్ప‌టం కొన్ని విష‌యాల్లో చోటు చేసుకుంటుంది. చ‌ట్టాన్ని తూచా త‌ప్ప‌కుండా పాటించే ప్ర‌జ‌లు.. కొన్ని విష‌యాల్లో మాత్రం అందుకు భిన్నంగా ఉంటారు. ఎవ‌రేం చెప్పినా తాము చేయాల‌నుకున్న‌దే చేద్దామ‌ని భావిస్తారు. మిగిలిన అన్ని విష‌యాల్లో చ‌ట్టం క‌ట్టుబాట్లు దాట‌ని వారు సైతం.. త‌మ భావోద్వేగాల‌కు సంబంధించిన అంశాల్లో మాత్రం వేటిని ప‌ట్టించుకోరు. అలాంటి అంశ‌మే ఒక‌టి తాజాగా తెర‌పైకి వ‌చ్చింది. కోడిపందేల విష‌యంలో క‌ఠిన చర్య‌ల‌కు తాము సిద్ధ‌మంటూ ఏపీ స‌ర్కారు ప్ర‌క‌టించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

సంక్రాంతి పండ‌గ వ‌స్తుందంటే చాలు.. ఈ పండ‌క్కి దాదాపు రెండు.. మూడు నెల‌ల నుంచే కోడిపుంజుల్ని రెఢీ చేసుకునే వారుంటారు. ఇక‌.. ఏడాది మొత్తం ఇదే ప‌ని మీద ఉండే వారి సంగ‌తి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఈ కోడి పందేల వ్య‌వ‌హారం మ‌హా జోరుగా సాగుతోంది. ఏపీలోని మ‌రికొన్ని జిల్లాల్లో కోడి పందేలు భారీగా సాగినా.. ఈ రెండు జిల్లాల హ‌డావుడి త‌ర్వాతే అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. తాజాగా కోండి పందేల నిర్వ‌హ‌ణ మీద దాఖ‌లైన పిటీష‌న్ మీద ఉమ్మ‌డి హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ఏపీ స‌ర్కారు త‌ర‌ఫు న్యాయ‌వాది వాదిస్తూ.. కోడి పందేల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. అయితే.. కోడి పందేల్ని అడ్డుకునేందుకు ఎలాంటి చ‌ర్య‌లు చేప‌డ‌తార‌న్న కోర్టు ప్ర‌శ్న‌కు.. కోడి పందేలు జ‌ర‌గ‌కుండా ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధిస్తుంద‌ని స్ప‌స్టం చేశారు. ఆంక్షల్ని అతిక్ర‌మించిన వారిపై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని ఏపీ స‌ర్కారు స్ప‌స్టం చేసింది. ఓప‌క్క న్యాయ‌స్థానం.. మ‌రోవైపు ఏపీ స‌ర్కారు క‌ఠినంగా ఉన్న నేప‌థ్యంలో.. ఈ పండ‌క్కి కోడి పందేల వ్య‌వ‌హారం ఏ దిశ‌గా వెళుతుంద‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.