Begin typing your search above and press return to search.

ఆ ఆపరేషన్ లో ముగ్గురు ఉగ్రవాదుల్ని లేపేసిన సంతోష్

By:  Tupaki Desk   |   20 Jun 2020 2:45 AM GMT
ఆ ఆపరేషన్ లో ముగ్గురు ఉగ్రవాదుల్ని లేపేసిన సంతోష్
X
చిన్న వయసులోనే కల్నల్ స్థాయికి ఎదిగిన బిక్కుమళ్ల సంతోష్ బాబు చైనా సైనికుల కిరాతకానికి బలి కావటం దేశ వాసుల కంట తడి పెట్టేలా చేసింది. దాదాపు పదహారేళ్లుగా సైన్యంలో వివిధ హోదాల్లో పని చేస్తున్న సంతోష్.. కెప్టెన్ గా తన కెరీర్ ను షురూ చేసినట్లు సతీమణి సంతోషి పేర్కొన్నారు. తన భర్త ఎంతో క్రమశిక్షణతో ఉండేవారని.. సైన్యంలో ఎన్నో ప్రశంసాపత్రాల్ని అందుకున్నట్లు చెప్పారు.

తన పెళ్లికి ముందు సైన్యం గురించి తెలీదని.. కానీ తర్వాత కానీ ఆర్మీ ఔనిత్యం తనకు తెలిసిందని పేర్కొన్నారు. దేశం కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టిన భర్త తీరు తనకు గర్వంగా ఉందన్న ఆమె.. భర్త స్ఫూర్తితోనే ఇద్దరు పిల్లల్ని పెంచుతానని చెప్పారు. తండ్రి సాహసాన్ని వారికి నూరిపోస్తానని పేర్కొన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించిన సంతోష్.. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళ సభ్యుడిగా కాంగోకి వెళ్లి అక్కడి అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చారన్నారు.

అక్రమిత కశ్మీర్ సరిహద్దు వద్ద కూడా ముగ్గురు ఐఎస్ఐ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన ఘనత సంతోష్ దేనని చెప్పారు. సైన్యంలో ఎంతో ధైర్యసాహసాల్ని ప్రదర్శించే భర్త ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడూ దేశ రక్షణకు సంబంధించిన విషయాల్ని అస్సలు ప్రస్తావించేవారు కాదన్నారు. పదహారో తేదీ ఉదయం ఆర్మీ అధికారులు తనకు ఫోన్ చేసి.. సంతోష్ చనిపోయిన విషయాన్ని చెప్పారన్నారు. ఆ విషయాన్ని ఆయన తల్లిదండ్రులకు చెప్పటానికి తాను చాలా కష్టపడ్డానని చెప్పారు. ఉదయమే విషయం తెలిసినా.. మధ్యాహ్నం వరకూ అత్తమామలకు విషయం చెప్పలేదన్నారు.

వారి ఆరోగ్య పరిస్థితి తెలిసినందున నిజాన్ని దాచాల్సి వచ్చిందని.. ఆ సమయంలో తనలో తాను విపరీతంగా కుమిలిపోయినట్లు చెప్పారు. పద్నాలుగున లద్దాఖ్ నుంచి ఫోన్ చేసి తన యోగక్షేమాల గురించి అడిగారని.. కరోనా విషయమై జాగ్రత్తగా ఉండాలని చెప్పారన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను కలలో కూడా అనుకోలేదన్నారు. చైనాకు గట్టిగా బుద్ధి చెప్పినప్పుడు మాత్రమే మరణించిన భారత సైనికుల ఆత్మకు శాంతి లభిస్తుందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇరవై మంది సైనికుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు.