Begin typing your search above and press return to search.

జూనియర్ ఠాక్రే ఆశలపై నీళ్లు... విపక్షానికే పరిమితమన్న పవార్

By:  Tupaki Desk   |   6 Nov 2019 2:27 PM GMT
జూనియర్ ఠాక్రే ఆశలపై నీళ్లు... విపక్షానికే పరిమితమన్న పవార్
X
నానాటికీ ఆసక్తి రేకెత్తిస్తున్న మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభన బుధవారం నాటికి కూడా తొలగిపోలేదు. డెడ్ లాక్ తొలగిపోతుందని ఆశించిన వారికి షాకిస్తూ తనదైన శైలి ప్రకటనలు గుప్పించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్... మహారాష్ట్రంలో ప్రతిష్టంభనను తొలగించే పని తనది కాదన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. నిన్నటిదాకా బీజేపీకి చెక్ పెట్టేసి కాంగ్రెస్ తో కలిసి శివసేనను గద్దెనెక్కించే దిశగా కదిలిన శరద్.. ఇప్పుడు సీఎం సీటుకు ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్న యువ నేత ఆదిత్య ఠాక్రేతో పాటు కుమారుడిని సీఎం చేద్దామని కలలు గంటున్న ఉద్ధవ్ ఠాక్రేకు గట్టి షాకిచ్చారు. ఎన్సీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్షంలోనే కూర్చుంటామని తాజాగా పవార్ చేసిన ప్రకటన ఆ రాష్ట్రంలో ‘పవర్’ ప్రకంపనలు రేపింది.

పవర్ పంపిణీకి ససేమిరా అంటున్న బీజేపీతో సంబంధం లేకుండానే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా శివసేన సీనియర్ నేత సంజయ్‌ రౌత్‌ నెరపుతున్న దౌత్యం ఫలించలేదు. ప్రభుత్వంలో తమతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా చేరేది లేదని పవార్ తెగేసి చెప్పారు. ప్రజాతీర్పునకు అనుగుణంగా తాను, తన మిత్రపక్షం కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ప్రతిపక్షంలో కూర్చుంటామని తేల్చిచెప్పారు. ఈ దిశగా ఇంకా ఆయన ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి పాత్ర పోషించాలనుకోవడం లేదు. ప్రతిపక్షంలో కూర్చోవాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. అందుకు అనుగుణంగా ప్రతిపక్షం పాత్రను సమర్థవంతంగా పోషిస్తాం. ప్రభుత్వ ఏర్పాటులో నేను భాగం కాదలుచుకోలేదు. కొన్నిరోజులపాటు నేను ముంబైలో ఉండటం లేదు. పుణె, సతారా, కరాద్‌ ప్రాంతాల్లో పర్యటించబోతున్నాను’ అని శరద్‌ బుధవారం తెలిపారు. శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌తో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అధికారాన్ని పంచుకోవడంలో బీజేపీ, శివసేన మధ్య రేగిన సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో ఎవరి అంచనాలకు అందడం లేదు. శివసైనికులు మంగళవారం మహారాష్ట్ర గవర్నర్‌ను కలిస్తే, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాని కలిసి భవిష్యత్‌ ప్రణాళికపై చర్చించారు. ఈ అధికార పోరాటంలో అవసరమైతే శివసేనకు మద్దతునివ్వాలని భావించిన ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చర్చలు జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాము ప్రజాతీర్పుకనుగుణంగా ప్రతిపక్షంలో కూర్చుంటామని ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సేనకు మద్దతునిచ్చే అంశంలో ఎవరూ తమను సంప్రదించలేదని, తమకు సంఖ్యా బలం లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు బీజేపీ, శివసేన తమ తదుపరి వ్యూహాలకు పదును పెడుతున్నాయి.