Begin typing your search above and press return to search.

దుర్గ‌మ్మ గుడిలో ప‌ట్టుచీర‌లు మాయం..

By:  Tupaki Desk   |   21 Oct 2019 9:07 AM GMT
దుర్గ‌మ్మ గుడిలో ప‌ట్టుచీర‌లు మాయం..
X
బెజవాడ దుర్గమ్మ గుడి సిబ్బందిలో కొంద‌రు దారి త‌ప్పారు. దుర్బుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏకంగా అమ్మ‌వారికి భ‌క్తులు స‌మ‌ర్పించిన ఖ‌రీదైన ప‌ట్టుచీర‌ల‌ను కూడా మాయం చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో బెజ‌వాడ దుర్గ‌మ్మ గుడి మ‌రోసారి వివాదాస్ప‌దంగా వార్త‌ల్లోకి వ‌చ్చింది. అమ్మవారికి భక్తులు భ‌క్తితో చీరలు సమర్పించ‌డం ఇక్క‌డ ఆన‌వాయితీగా వ‌స్తోంది. అయితే.. భ‌క్తులు స‌మ‌ర్పించ‌డంలో అత్యంత ఖ‌రీదైన ప‌ట్టుచీర‌లు కూడా ఉంటాయి. ఇక్క‌డే కొంద‌రు సిబ్బంది త‌మ దుర్బుద్ధిని చూపించిన‌ట్లు తెలుస్తోంది.

పట్టు చీరల్లో జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం చేతివాటం ప్రదర్శించినట్లు అధికారులు గుర్తించడం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అమ్మ‌వారి గుడిలో ఇలా చేస్తారా..? అంటూ భ‌క్త‌జ‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇంతకు జూనియ‌ర్ అసిస్టెంట్ సుబ్ర‌హ్మ‌ణ్యం ఏం చేశాడంటే.. భక్తులు సమర్పించిన ఖరీదైన పట్టు చీరల స్థానంలో వేరే చీరలు మార్చినట్లు అధికారులు విచారణలో తెలినట్లు తెలిసింది.

అమ్మవారికి భ‌క్తులు స‌మ‌ర్పించిన‌ చీరల విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో దేవాదాయ శాఖ కమిషనర్ పద్మ ఆలయంలోని చీరల గోదాములో విచారణ చేపట్టడంతో ఈ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇందులో దాదాపు రూ.11.60 ల‌క్ష‌ల వరకు అవ‌క‌త‌వ‌క‌లు జరిగినట్లు అధికారులు గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. ఇక్క‌డే మ‌రో విష‌యం కూడా వెలుగులోకి వ‌చ్చింది. సిబ్బంది అవ‌క‌త‌వ‌క వ్య‌వ‌హారం పట్టు చీరల వ‌ర‌కే ప‌రిమితం కాలేదు. ఆఖ‌రికి ముక్కల చీరలతో గుడ్డ సంచులు కుట్టించడంలోనూ సుబ్రహ్మణ్యం తన దుర్బుద్ధిని చూపించిన‌ట్లు తెలుస్తోంది.

ఈ మేర‌కు అధికారులు కూడా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. జూనియ‌ర్ అసిస్టెంట్ సుబ్ర‌హ్మ‌ణ్యంను విధుల నుంచి తప్పించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దుర్గగుడి పూర్వపు ఈవో కొటేశ్వరమ్మ వద్ద సుబ్రహ్మణ్యం సీసీగా పనిచేసిన విష‌యం తెలిసిందే. అయితే.. అత్యంత‌ పవిత్రమైన బెజ‌వాడ అమ్మవారి సన్నిధిలోనే ఇలాంటి వ్య‌వ‌హారాలు ప‌దేప‌దే జ‌రుగుతుండ‌డంపై భక్తజ‌నం ఆందోళ‌న చెందుతున్నారు. ఇలా ప‌దేప‌దే జ‌ర‌గ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.