Begin typing your search above and press return to search.

గంజాయి అక్రమ దందా చేస్తున్న సర్పంచ్‌ అరెస్ట్ .. ఎక్కడంటే

By:  Tupaki Desk   |   1 Oct 2021 8:40 AM GMT
గంజాయి అక్రమ దందా చేస్తున్న సర్పంచ్‌ అరెస్ట్ .. ఎక్కడంటే
X
కాదేదీ అక్రమ రవాణాకు అనర్హం అన్న చందంగా గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. గంజాయి అక్రమ రవాణాకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆ మధ్య అంబులెన్స్ లో , బొగ్గు లారీలో , సిమెంట్, ఇటుకల లారీలలో గంజాయి అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. ఎంతమంది పోలీసులు ఎంత గస్తీ పెట్టినా , సోదాలు చేస్తున్నా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సరఫరా విచ్చలవిడిగా కొనసాగుతోంది. అక్రమ మార్గాల ద్వారా గంజాయి సరిహద్దులు దాటుతోంది. దేశ వ్యాప్తంగా పోలీసులు చేస్తున్న తనిఖీల్లో ఏపీలో పండిన గంజాయి అధికంగా లభిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇక ఇదిలా ఉంటే ప్రజలకు సేవ చేయాల్సిన ఓ ప్రజా ప్రతినిధి ఏకంగా గంజాయి వ్యాపారమే ప్రారంభించారు. అక్రమంగా గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.ఈ సంఘటన ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌ నగర్‌ మండలంలోని ఈస్‌గాం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను గురువారం పట్టుకున్నట్లు సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్సై సందీప్‌ కుమార్‌ తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో చిన్నమాలిని గ్రామ సర్పంచ్‌ సుర్పం భగవంత్‌రావు, ఈస్‌గాం గ్రామానికి చెందిన సౌమిత్ర సర్కార్‌ లు గంజాయి సంప్లయ్ చేస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో నిఘా పెట్టిన పోలీసులు వారిద్దరూ రహస్య ప్రాంతం నుంచి ఈజ్‌గాం మార్కెట్‌కు గంజాయి తరలిస్తుండగా మాటువేసి పట్టుకున్నారు. వీరి వద్దనుంచి 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.

గంజాయి దందాకు చెక్ పెట్టాలని ఎవరు ఎంత ప్రయత్నం చేసినా స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు.తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సాగు, అక్రమ రవాణా చేస్తున్న హైటెక్ ముఠాను పట్టుకోవాల్సిన అవసరం వుంది.ఇప్పటికైనా గంజాయి దందాపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. అసలు సాగు చెయ్యకుండా నిలువరించగలిగితే ఈ దందాను కొంతమేర అడ్డుకున్నట్టే .