Begin typing your search above and press return to search.

21 ఏళ్లకే సర్పంచ్.. ఔరా ఎవరీయన? ఎక్కడనో తెలుసా?

By:  Tupaki Desk   |   25 July 2022 4:30 PM GMT
21 ఏళ్లకే సర్పంచ్.. ఔరా ఎవరీయన? ఎక్కడనో తెలుసా?
X
21 ఏళ్లకు డిగ్రీ కూడా అయిపోదు.. నూనుగు మీసాల యవ్వనంలో ఉంటాము.. ఒకరికి చెప్పే స్థితిలో అస్సలు ఉండము.. మనం చెప్పించుకునే స్థితిలోనే ఉంటాం. ఆ వయసులో ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఓ యువకుడు మాత్రం ఏకంగా గ్రామాన్ని ఏలుతున్నాడు. ఊరికి సర్పంచ్ అయిపోయాడు.నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజంగా నిజం.

మధ్యప్రదేశ్ లోని ఓ యువకుడు ఊరికి సర్పంచ్ గా ఎన్నికయ్యాడు. దేశంలోనే అతి చిన్న వయసు గల సర్పంచ్ గా రికార్డు సృష్టించాడు. మధ్యప్రదేశ్ లోని విదిశ జిల్లాకు చెందిన అనిల్ యాదవ్ అనే యువకుడు సర్పంచ్ గా ఎన్నికయ్యాడు.

సరేఖో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడిన అతడు.. 12 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థిపై గెలిచి దేశంలోనే అతి పిన్న వయసు గల సర్పంచ్ గా రికార్డు సృష్టించాడు. అనిల్ వయసు కేవలం 21 ఏళ్లు 6 రోజులు మాత్రమే కావడం గమనార్హం. ఇప్పటివరకూ ఈ రికార్డ్ రాజస్థాన్ భరత్ పూర్ జిల్లా డింగ్ పంచాయతీకి చెందిన అస్రుని ఖాన్ అనే వ్యక్తి పేరిట ఉండేది. అతడు 21 ఏళ్ల 18 రోజులకే సర్పంచ్ అయ్యాడు.

ప్రస్తుతం పీజీ చదువుతున్న అనిల్ యాదవ్.. కరోనా సమయంలో ఊరికి వచ్చినప్పుడు గ్రామంలో ప్రజలు, స్నేహితులు ఇబ్బందులు పడడం చూసి చలించిపోయాడు. విలేజ్ లో సరైన సదుపాయాలు లేక ప్రజలు అవస్థలు పడటం గమనించాడు.

ఆ సమయంలో తన వల్ల అయిన సాయం చేశాడు. ఉన్నతాధికారులతో మాట్లాడి.. గ్రామంలో గోశాల, ఆటస్థలం, స్ట్రీట్ లైట్లు, రోడ్లు వేయించాడు. ఇదే సమయంలో గ్రామంలో పంచాయితీ ఎన్నికలు రావడంతో గ్రామస్థులు అనిల్ యాదవ్ నే సర్పంచ్ గా నిలబెట్టారు.

ఇక అనిల్ పై బీజేపీ నేత, ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ మేనల్లుడు వివేక్ శర్మ పోటీకి దిగాడు. ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొన్నారు. కానీ గ్రామస్థులు అనిల్ యాదవ్ నే సర్పంచ్ గా ఎన్నుకున్నారు. సర్పంచ్ గా గెలిచిన తర్వాత జిల్లా పాలనాధికారితోపాటు తనకు సహకరించిన అందరికీ అనిల్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని అనిల్ యాదవ్ అన్నారు. గ్రామాన్ని ఆదర్శమయంగా మార్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.