Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే తీరు న‌చ్చ‌క‌.. టీఆర్ఎస్‌కు స‌ర్పంచ్‌ల షాక్‌

By:  Tupaki Desk   |   22 Nov 2021 3:30 PM GMT
ఎమ్మెల్యే తీరు న‌చ్చ‌క‌.. టీఆర్ఎస్‌కు స‌ర్పంచ్‌ల షాక్‌
X
తెలంగాణ‌లో వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్ ప‌ట్ల వ్య‌తిరేక‌త పెరుగుతున్న‌ట్లే క‌నిపిస్తోంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుత ప‌రిణామాలు చూస్తుంటే అది నిజమ‌నిపించ‌క మాన‌దు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్ర‌భుత్వ వైఖ‌రిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సొంత పార్టీ నేత‌లే త‌మ అస‌మ్మ‌తి గ‌ళాన్ని బ‌హిరంగంగా వినిపిస్తున్నారు. మొన్న తెలంగాణ పంచాయ‌తీ ఛాంబ‌ర్ ప్ర‌తినిధులు సీఎం కేసీఆర్ త‌మ డిమాండ్ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని చెప్ప‌గా.. తాజాగా హ‌నుమ కొండ జిల్లాలోని శాయంపేట మండ‌లంలోని టీఆర్ఎస్ స‌ర్పంచులు ఇప్పుడు తిరుగుబావుటా ఎగ‌రేశారు.

ఆ మండలంలోని టీఆర్ఎస్ స‌ర్పంచ్‌లు ఆ పార్టీ స‌భ్య‌త్వాల‌కు రాజీనామా చేయ‌డానికి సిద్ధ‌మైన‌ట్లు స‌ర్పంచుల ఫోరం మండ‌ల అధ్య‌క్షుడు అబ్బు ప్ర‌కాశ్‌రెడ్డి ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌రమ‌ణారెడ్డి వైఖ‌రిని ప‌ట్ల తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. గండ్ర దంపతులు అసలు స‌ర్పంచ్‌ల‌ను ప‌ట్టించుకోవ‌డ‌మే లేద‌నే టాక్ ఉంది. గ్రామ అభివృద్ధి ప‌నుల కోసం ఎమ్మెల్యే ద‌గ్గ‌రికి వెళ్తే స్పందించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గ్రామాల్లో స‌మావేశాలు నిర్వ‌హించినా.. ఏమైనా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు చేపట్టినా స‌ర్పంచ్‌ల‌కు ఆహ్వాన‌మే అంద‌డం లేదని తెలిసింది. ఎంపీపీ మాట‌లు విని గ్రామాల అభివృద్ధిని ఎమ్మెల్యే ప‌ట్టించుకోవ‌డం లేద‌ని స‌ర్పంచ్‌లు విమ‌ర్శిస్తున్నారు.

ఇన్ని రోజులు ఓపికగా ఎదురుచూసిన శాయంపేట మండలంలోని స‌ర్పంచ్‌లు ఇప్పుడు త‌మ ఆగ్ర‌హాన్ని బ‌య‌ట‌పెట్టారు. ఆ మండ‌లంలోని 24 గ్రామ పంచాయ‌తీల‌కు గాను 23 చోట్ల టీఆర్ఎస్ స‌ర్పంచ్‌లున్నారు. అందులో 21 మంది తాజాగా స‌మావేశం పెట్టి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. 15 రోజుల్లోగా ఎమ్మెల్యే వైఖ‌రిలో మార్పు రాకుంటే పార్టీకి రాజీనామా చేస్తామ‌ని డెడ్‌లైన్ పెట్ట‌డ‌మూ సంచ‌ల‌నంగా మారింది. మ‌రోవైపు ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీల స‌మ‌స్య‌ల‌ను, డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అందుకే త్వ‌ర‌లో జ‌రిగే స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ కోటాలో పోటీ చేయ‌నున్న‌ట్లు తెలంగాణ పంచాయ‌తీ ఛాంబ‌ర్ ప్ర‌తినిధులు వెల్ల‌డించారు.

ఇప్ప‌టికే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ను గద్దె దించ‌డం కోసం కాంగ్రెస్‌, బీజేపీ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తాయి. మ‌రోవైపు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు టీఆర్ఎస్ ప్ర‌జా ప్ర‌తినిధులు వైఖ‌రి కార‌ణంగా సొంత పార్టీ నేత‌ల్లోనే అసంతృప్తి పెరుగుతోంది. మ‌రి ఈ అసంతృప్తిని త‌గ్గేంచేందుకు కేసీఆర్ ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి. వీలైనంత త్వ‌ర‌గా ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దుకోవ‌డం ఆయ‌న‌కు అవ‌స‌రం. ఎందుకంటే అవ‌తలి వైపు ప్ర‌త్య‌ర్థి పార్టీలు అవ‌కాశం రాగానే టీఆర్ఎస్ నేత‌ల‌ను త‌మ పార్టీలోకి చేర్చుకునేందుకు ఎదురు చూస్తున్నాయ‌నే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.