Begin typing your search above and press return to search.

ఆ జీవో కేసీఆర్‌ కు 'చెక్' చెబుతుందా?

By:  Tupaki Desk   |   27 July 2019 3:35 PM GMT
ఆ జీవో కేసీఆర్‌ కు చెక్ చెబుతుందా?
X
కేసీఆర్ పాలనలో తెలంగాణలో అంతా సవ్యంగా సాగుతున్నట్లుగా కనిపిస్తున్నా ప్రజలు - నాయకులు ఇద్దరిలోనూ అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందని తరచూ ఏదో ఒక సంఘటన నిరూపిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంపై తాజాగా సర్పంచులు మండిపడుతున్నారు. తమతో సమానంగా ఉప సర్పంచులకు కూడా చెక్ పవర్ ఇవ్వడంపై గుర్రుమంటున్నారు. వారికి చెక్ పవర్ ఇవ్వడం తమకు ఇష్టంలేదని కేసీఆర్‌ కు ఆ సంఘం నేతలు చెప్పినా ఆ నిర్ణయం మారకపోవడంతో అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఇప్పుడు ఏకంగా నిరసనలకు దిగుతున్నారు.

ఉప సర్పంచ్‌ లకు చెక్ పవర్ ఇవ్వడంపై ఆందోళన చేపట్టిన సర్పంచులు ఏకంగా తమ ఊరిలో ఓ కార్యక్రమానికి వచ్చిన మంత్రులను అడ్డుకున్నారు. తమతో ఉప సర్పంచులు సమానమా ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లాను ఓడీఎఫ్ రహితంగా ప్రకటించాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు - ఇంద్రకరణ్ రెడ్డి వెళ్లగా ఆ ప్రాంత సర్పంచులంతా అక్కడ చేరి మంత్రులను ఘెరావ్ చేశారు. ఓడీఎఫ్ విషయం కాదు .. తమ సంగతి చూడాలని కోరారు. తమకు ఉప సర్పంచులతో సమానంగా చెక్ పవర్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. దీనిపై మాట్లాడుదామని మంత్రులు సర్దిచెప్పినా వినలేదు. సర్పంచుల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.

పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేయాలని.. ఉప సర్పంచులకు కల్పించిన చెక్ పవర్ తొలగించాలని.. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. సర్పంచ్‌ ల ఆందోళనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు కలుగజేసుకొని .. సర్పంచ్‌ లను అదుపులోకి తీసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అయితే.. సర్పంచుల సంఘం నేతృత్వంలో ఈ విషయంపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు వారు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే.. కేసీఆర్ ప్రభుత్వానికి సెగ తప్పకపోవచ్చు.

ఇంతవరకు ఏ ఇబ్బంది వచ్చినా కప్పుకొంటూ సాగిపోతున్న కేసీఆర్ ఇప్పుడు సర్పంచులు అడ్డంతిరిగితే మాత్రం ఇబ్బందిపడక తప్పదు. తెలంగాణపై బీజేపీ పూర్తిగా ఫోకస్ చేస్తున్న తరుణంలో సర్పంచుల ఆగ్రహాన్ని చల్లార్చకపోతే దాన్ని బీజేపీ అవకాశంగా మలచుకునే అవకాశమూ ఉంది. దీన్ని కేసీఆర్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి.. మొండి పట్టుదలతో ముందుకెళ్తారో.. లేదంటే గ్రామస్థాయి నేతలకు తల వంచుతారో చూడాలి.