Begin typing your search above and press return to search.

అయ్యో.. సర్వే సత్యనారాయణకు ఎంత కష్టమొచ్చిందీ?

By:  Tupaki Desk   |   26 Nov 2018 10:42 PM IST
అయ్యో.. సర్వే సత్యనారాయణకు ఎంత కష్టమొచ్చిందీ?
X
సర్వే సత్యనారాయణ.. ఈ నోటి గురించి తెలియనివారు లేరు. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడడంలో ఆయనకు ఆయనే సాటి. అలాంటి సీనియర్ కాంగ్రెస్ నేత పాపం ఇప్పుడు తమ చిరకాల ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల కోసం ప్రచారాలు చేయడమే కాకుండా వారికి మంత్రి పదవులు ఇస్తామని... అవసరమైతే తన స్థానంలో వారిని పోటీ చేయనిస్తానని కూడా చెప్పాల్సి వస్తోంది. టీడీపీ - కాంగ్రెస్ పొత్తుల పుణ్యమా అని సర్వేలాంటి వీర కాంగ్రెస్ విధేయులు కూడా టీడీపీ నేతలకు చెమ్చాగిరీ చేయాల్సి వస్తోందని ఆయన అనుచరుల నుంచి వినిపిస్తోంది.

కూకట్‌ పల్లిలో ప్రజా కూటమి నుంచి పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థి సుహాసిని తరఫున ప్రచారం చేసిన సర్వే సత్యనారాయణ పాపం పొత్తులు పెట్టుకున్న పాపానికి ఎన్నో హామీలు ఇవ్వాల్సి వచ్చింది. కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమైన ఆయన... సుహాసినిని గెలిపించాలని కోరడమే కాకుండా ప్రజాకూటమి సారథ్యంలో కాంగ్రెస్ గద్దెనెక్కగానే సుహాసినిని మంత్రిని చేస్తామని చెప్పారు.

ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన సుహాసినిని మన ఆడబిడ్డగా ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా పెద్దిరెడ్డి బరిలో దిగితే ఆయనను దగ్గరుండి గెలిపిస్తానన్నారు.

అయితే... సర్వే లాంటి నేత తన స్థానాన్ని ఖాళీ చేసి ఒక టీడీపీ నేతకు పోటీ చేసే అవకాశం ఇస్తానని చెప్పడాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. కార్యకర్తల సమావేశం దగ్గరే దీనిపై బాహాటంగా కామెంట్లు వినిపించాయి.