Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ నుంచి ఇంకో సీఎం రెడీ అయ్యారు

By:  Tupaki Desk   |   4 Dec 2018 5:35 PM GMT
కాంగ్రెస్ నుంచి ఇంకో సీఎం రెడీ అయ్యారు
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మ‌రో సంచ‌ల‌నం చోటుచేసుకుంది. ఇప్ప‌టికే ఆ పార్టీ పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు మ‌రింత ఆజ్యం పోసేలా ఆ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత క‌ల‌క‌లం సృష్టించే కామెంట్లు చేశారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ అంటే అభ్య‌ర్థులు ఎక్కువ‌..సీఎం సీటు కోసం బ‌రిలో నిలిచేది అంత‌కంటే ఎక్కువ అనే విమ‌ర్శ‌లు, సెటైర్లు ఉన్న సంగ‌తి తెలిసిందే. దీన్ని నిజం చేస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సర్వే సత్యనారాయణ తాజాగా ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.తాను సైతం ముఖ్య‌మంత్రి రేసులో ఉన్నాన‌ని ఆయ‌న వ్యాఖ్యానిచారు. త‌న‌కు సీఎం సీటు ఎలా ద‌క్కుతుందో చెప్ప‌డం కాదు...ఒక‌వేళ ద‌క్క‌క‌పోతే త‌న ముందున్న ఆప్ష‌న్ల‌ను కూడా ఆయ‌న వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ కూటమి నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సర్వే సత్యనారాయణ ఇవాళ నిర్వహించిన రోడ్‌షోలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి వస్తే తనకు ముఖ్యమంత్రి అవకాశం వస్తుందని ప్ర‌క‌టించుకున్నారు. 'టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చి మాట తప్పారు. ఒకవేళ కాంగ్రెస్‌ అధిష్ఠానం దళితుడిని సీఎం చేస్తానని నిర్ణయిస్తే నాకే అవకాశం వస్తుంది. డిప్యూటీ సీఎం పదవైనా వస్తుంది' అని అన్నారు.

కాగా, స‌ర్వే చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. మ‌హాకూట‌మి అధికారంలోకి వ‌స్తే సీఎం పీఠం గురించి ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీకి చెందిన రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన ముఖ్య నేత‌లు సీఎం పీఠంపై గురి పెట్టార‌ని వార్త‌లు వ‌స్తుండ‌గా...అందులోకి మ‌హిళకు సీఎం పీఠం...తెలంగాణ‌లో బ‌లంగా ఉన్న బీసీల‌కు అవ‌కాశం క‌ల్పించ‌డం వంటి స‌మీక‌ర‌ణాల గురించి చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ జాబితాలో తాజాగా ద‌ళిత కార్డుతో స‌ర్వే ఎంట్రీ ఇవ్వ‌డంతో కాంగ్రెస్ నేత‌ల‌ సీఎం పీఠం ఆశ హాట్ టాపిక్‌గా మారింది.