Begin typing your search above and press return to search.

వరంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణ

By:  Tupaki Desk   |   4 Nov 2015 6:13 AM GMT
వరంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణ
X
వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. దీంతో సర్వే సత్యనారాయణ నామినేషన్‌ వేసేందుకు వరంగల్‌ బయలుదేరారు. నేటితో వరంగల్‌ నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో ఆయన హుటాహుటిన హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్నారు.

ఇంతకుముందు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేరును అధిష్ఠానం ఖరారుచేయడం ఆయన ఇప్పటికే ఒక సెట్ డమ్మీ నామినేషన్ వేయడం తెలిసిందే. అయితే... మంగళవారం అర్ధరాత్రి దాటాకా రాజయ్య ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి కోడలు - ముగ్గురు మనుమలు చనిపోవడంతో ఆయన బరి నుంచి తప్పుకున్నారు. దాంతో నామినేషన్లకు చివరి రోజయిన ఈ రోజే అభ్యర్థిని ప్రకటించి నామినేషన్ వేయించాల్సి ఉంది. దీంతో తెలంగాణలో, ఢిల్లీలో వెంటవెంటనే పరిణామాలు మారుతూ చివరికి మాజీ ఎంపీ సర్వే సత్వనారాయణకు టిక్కెట్ ప్రకటించారు.

రాజయ్య ఇంట్లో ప్రమాదం తరువాత కొత్త అభ్యర్థిని ఎంపికచేయడానికి పార్టీ పరంగా కొంత హైడ్రామా నడిచింది. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌ పేరును ఖరారు చేశారని తొలుతు వార్తలు వచ్చాయి. 2009-14 మధ్య వర్ధన్నపేట నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన్ను అభ్యర్థిగా నిలుపుతారని ప్రచారం జరిగింది. అయితే, అంతలోనే ఏమైందో సర్వే పేరు తెరపైకి వచ్చి ఖరారైపోయింది. దాంతో సర్వే వరంగల్ హైవే ఎక్కారు.

మరోవైపు రాజయ్య కోడలు అగ్నిప్రమాదంలో ఆయన కోడలు మృతిచెందడంపై అందరి వేళ్లూ రాజయ్య వైపే చూపిస్తున్నాయి. మహిళా సంఘాలు, మృతురాలి తల్లిదండ్రులు రాజయ్యపైనే ఆరోపణలు చేస్తున్నారు. కాగా రాజయ్యకు టిక్కెట్ ఇవ్వరాదంటూ ఆయన కోడలు చనిపోవడానికి ముందు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాకు లేఖ రాసినట్లు చెబుతున్నారు.