Begin typing your search above and press return to search.

ట్యాంప‌రింగ్ వ‌ల్లే టీఆర్ ఎస్‌కు భారీ మెజారిటీ

By:  Tupaki Desk   |   28 Nov 2015 11:30 AM GMT
ట్యాంప‌రింగ్ వ‌ల్లే టీఆర్ ఎస్‌కు భారీ మెజారిటీ
X
వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి ద‌యాక‌ర్‌ కు భారీ మెజారిటీ రావ‌డం వెనుక ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అవ‌క‌త‌వ‌క‌లు జరిగాయ‌ని విప‌క్షాలు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి ప‌సునూరి ద‌యాక‌ర్‌ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో.. అనూహ్యంగా నాలుగున్న‌ర ల‌క్ష‌ల మెజారిటీతో గెలుపొందిన విష‌యం తెలిసిందే. అయితే ఈవీఎంల‌లో గోల్‌ మాల్ వ‌ల్లే ఇంత మెజారిటీ వ‌చ్చింద‌ని కాంగ్రెస్ అభ్య‌ర్థి స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ‌, వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసిన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ విడివిడిగా ఆరోపించారు.

ఈవీఎంలలో ట్యాంపరింగ్ వల్లే వరంగల్‌ లో టీఆర్ ఎస్ పార్టీకి అంత మెజారిటీ వచ్చిందని సర్వే సత్యనారాయ‌ణ విమర్శించారు. గాంధీభ‌వ‌న్‌ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈ సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. వ‌రంగ‌ల్ తీర్పు ప్రజాతీర్పు కాదని ఆరోపించారు. దీనిపై రిటైర్డ్ జడ్జితో బహిరంగ విచారణ జరిపించాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈవీఎంలు కరెక్టని తేలితే కేసీఆర్‌ కు సలాం చేస్తానని, ట్యాంపరింగ్ జరిగినట్లు తేలితే కేసీఆర్ రాజీనామా చేస్తారా అని ఆయ‌న స‌వాల్ విసిరారు. ఈ విష‌యంపై కేసీఆర్ విచారణ జరిపించకపోతే తానే కోర్టుకు వెళతానని చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో టీఆర్ ఎస్‌ కు తీవ్ర వ్యతిరేకత కనిపించిందని గుర్తు చేశారు. ఆ పార్టీ నేతలను, మంత్రులను ప్రజలు నిలదీశారని చెప్పారు. ఉద్యమకాలంలో కూడా టీఆర్ ఎస్‌ కు ఇంత భారీ మెజారిటీ రాలేదని, ఇప్పుడు ఇంత మెజారిటీ రావటానికి, కాంగ్రెస్‌ కు డిపాజిట్ రాకపోవటానికి ఈవీఎంలలో అవకతవకలే కారణమని చెప్పారు. కంటోన్ మెంట్ ఎన్నికలనుంచే టీఆర్ ఎస్ పార్టీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయటం ప్రారంభించిందని సర్వే ఆరోపించారు. ప్రచారంలో కేసీఆర్‌ ను వ్యక్తిగతంగా దూషించినందుకు క్షమాపణ కోరుతున్నానన్నారు. వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి గాలి వినోద్‌ కుమార్ కూడా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయటంవల్లే టీఆర్ ఎస్ భారీ మెజారిటీ సాధించిందని ఆరోపించారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి, డబ్బు - మద్యం ఏరుల్లా పారించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యలపై పాలకులను స్థానిక ప్రజలు ఎక్కడకెళ్ళినా నిలదీశారని, అయినా ఇంత మెజారిటీ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఏదేమైనా ఎన్నిక‌ల‌కు ముందు ఎవ్వ‌రూ ఊహించ‌ని స్థాయిలో టీఆర్ ఎస్‌ కు రికార్డు స్థాయిలో మెజార్టీ రావ‌డంతో ప్ర‌తిప‌క్షాలు ఈ కొత్త విమ‌ర్శ‌లు ఎందుకు స్టార్ట్ చేశాయో అర్థం కావ‌డం లేదు.