Begin typing your search above and press return to search.

వైద్యం కోసం విదేశాలకు వద్దని అప్పట్లో అమ్మ చెప్పిందట

By:  Tupaki Desk   |   24 Dec 2022 1:30 PM GMT
వైద్యం కోసం విదేశాలకు వద్దని అప్పట్లో అమ్మ చెప్పిందట
X
దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పురుట్చితలైవి జయలలిత మరణం ఇప్పటికి అందరిని విస్మయానికి గురి చేస్తుందని చెప్పాలి. జ్వరంతో అర్థరాత్రి దాటిన తర్వాత హడావుడిగా చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించటం.. కట్ చేస్తే వారాల తర్వాత నిర్జీవంగా ఆమెను శవపేటికలో పెట్టి బయటకు తీసుకొచ్చిన వైనం షాకింగ్ గా మారటం తెలిసిందే.

ఆమె  మరణంపై బోలెడన్ని అనుమానాలు వ్యక్తమైనా అవేమీ నిజం కాదన్నట్లుగా కొందరు వాదనలు వినిపిస్తారు. అయితే.. ఆసుపత్రిలో సీసీ కెమేరాలు లేకపోవటంతో పాటు.. గుట్టుగా జరిగిన వైద్యంపై పలు సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.

అమ్మ ఆరోగ్యం అంతకంతకూవిషమిస్తున్న వేళ.. ఆమెను విదేశాలకు ఎందుకు తీసుకెళ్లలేదు? ఆమెకు విదేశీ వైద్యం చేయిస్తే ఆరోగ్యం మెరుగయ్యేదా? లాంటి ప్రశ్నలు వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వాటికి తాజాగా సమాధానం చెప్పారు అమ్మకు అత్యంత సన్నిహితురాలైన నెచ్చలి శశికళ. తాజాగా ఆమె ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. జయలలితకు విదేశాల్లో వైద్యం చేయించుకోవటం ఇష్టం లేదన్నారు.

చికిత్స కోసం తాను విదేశాలకు వెళ్లే ఉద్దేశం లేదని జయలలిత వైద్యులతో స్పష్టం చేశారన్నారు. అందుకే.. ఆమెకు చెన్నైలోనే వైద్యం చేసినట్లు చెప్పారు. తన మద్దతుదారుల నడుమ క్రిస్మస్ వేడుకల్ని నిర్వహించిన శశికళ.. తాను ఓపీఎస్.. ఈపీఎస్ లకు సంబంధించి ఎవరికి మద్దుతగా.. ఎవరికీ వ్యతిరేకంగా లేనట్లు చెప్పారు.

తనకు పార్టీలో అందరు కావాలన్న ఆమె.. తాను ఉన్నంతవరకు కార్యకర్తల్ని నిరుత్సాహపర్చనని చెప్పారు. తనకు చికిత్స చేస్తున్న వైద్యులకు.. తాను వైద్యం కోసం విదేశాలకు వెళ్లాలని అనుకోవటం లేదని జయలలిత స్వయంగా చెప్పారని.. అందుకే విదేశాలకు వెళ్లలేదని పేర్కొన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.