Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ‌కు చుక్క‌లు చూపే సీన్ సెట్ చేశారా?

By:  Tupaki Desk   |   18 April 2017 5:05 AM GMT
చిన్న‌మ్మ‌కు చుక్క‌లు చూపే సీన్ సెట్ చేశారా?
X
అన్నాడీఎంకేలో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుందా? అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత పార్టీని.. ప్ర‌భుత్వాన్ని త‌న గుప్పిట్లోకి తెచ్చుకున్న చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే సీన్ ఒక‌టి సిద్ధ‌మైందా? ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో.. చీలికైన అన్నాడీఎంకే రెండు వ‌ర్గాలు ఒక‌టి కాకుంటే.. మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని భావిస్తున్నారా? ఇందులో భాగంగా జైల్లో ఉన్న చిన్న‌మ్మ‌కు ఝుల‌క్ ఇచ్చేందుకు ప‌క్కావ్యూహం సిద్ధ‌మైందా? అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత ఆమెకు వీర‌విధేయుడైన ప‌న్నీరు సెల్వాన్ని ముఖ్య‌మంత్రిగా చేస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే. త‌ర్వాతి కాలంలో వ్యూహాత్మ‌కంగా పార్టీ ప‌ద‌విని.. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి మీదా క‌న్నేసిన చిన్న‌మ్మ శ‌శిక‌ళ తీరుతో సీన్ మొత్తం మారిపోయింది. అప్ప‌టివ‌ర‌కూ వీర విధేయుడి పాత్ర‌ను పోషించిన ప‌న్నీర్ సెల్వం.. త‌న తీరుకు భిన్నంగా చిన్న‌మ్మ మీద తిరుగుబాటు బావుటా ఎగురువేశారు. ఒక‌ద‌శ‌లో సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులుక‌దిపినా.. చిన్న‌మ్మ శ‌క్తియుక్తుల ముందు వ‌ర్క్ వుట్ కాలేదు.

అయితే.. అక్ర‌మాస్తుల కేసు అనూహ్యంగా తెర మీద‌కు వ‌చ్చి.. చిన్న‌మ్మ దోషిగా నిరూపితం కావ‌టంతో ఆమె జైలుకి వెళ్లాల్సి వ‌చ్చింది. ఇలాంటి వేళ‌లో.. త‌న ప‌రోక్షంలో పార్టీ.. ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్ని స‌మీక్షించేందుకు అన్నాడీఎంకేలో లేని ప‌ద‌విని ఒక‌టి సృష్టించి.. త‌న‌కు కొడుకు వ‌ర‌సైన దిన‌క‌ర‌న్‌ ను ప‌గ్గాలు అప్ప‌గించి జైలుకు వెళ్లారు. అయితే.. దిన‌క‌ర‌న్ వైఖ‌రితో సీఎం ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామితో స‌హా ప‌లువురు సీనియ‌ర్ మంత్రులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

ఇదే స‌మ‌యంలో.. ప‌న్నీర్ సెల్వం వ్యూహాత్మ‌కంగా క‌దిపిన పావుల నేప‌థ్యంలో.. రెండుగా చీలిన అన్నాడీఎంకే తిరిగి ఏకం కావాల‌న్న వాద‌న‌ను తెర మీద‌కు తీసుకొచ్చారు. ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల‌ నేపధ్యంలో.. ప‌న్నీర్ మాట‌కు రెండు వ‌ర్గాల్లో విశేష‌మైన చ‌ర్చ జ‌ర‌గ‌ట‌మే కాదు.. చివ‌ర‌కు ముఖ్య‌మంత్రి ప‌ళ‌ని స్వామి క్యాబినెట్ మీటింగ్‌ లో చ‌ర్చించిన‌ట్లుగా తెలుస్తోంది.

ఈ మొత్తం ఎపిసోడ్‌ లో చిన్న‌మ్మ‌ను.. ఆమె విధేయుడు దిన‌క‌ర‌న్‌ ను ప‌క్క‌న పెట్టాల‌న్న అంశాన్ని చ‌ర్చించిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ వాద‌న‌కు చేకూరేలా తాజా ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టం గ‌మ‌నార్హం. సోమ‌వారం రాత్రి బాగా పొద్దుపోయిన త‌ర్వాత త‌మిళ‌నాడు సీనియ‌ర్ మంత్రులు అత్య‌వ‌స‌రంగా భేటీ అయ్యారు. పార్టీలోని చీలిక వ‌ర్గాలు రెండూ ఏకం కావాల‌న్న అంశంపై జోరుగా చ‌ర్చ‌లు సాగిన‌ట్లుగా తెలుస్తోంది.

చిన్న‌మ్మ‌ను.. ఆమె బంధువు దిన‌క‌ర‌న్‌ ను ప‌క్క‌న పెట్టాల‌ని.. మిగిలిన వారంతా ఏకం కావాల‌న్న ఎజెండాతో చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లుగా తెలుస్తోంది. దీనికి ముఖ్య‌మంత్రి ప‌ళ‌ని స్వామి సైతం సానుకూలంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఓప‌క్క శ‌శిక‌ళ‌.. మ‌రోప‌క్క మోడీ స‌ర్కారు పుణ్య‌మా అని తీవ్ర ఒత్తిడుల మ‌ధ్య ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌టం క‌ష్టంగా ఉంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. తాజాగా చోటుచేసుకున్న‌ ప‌రిణామాల నేప‌థ్యంలో.. జ‌రుగుతున్న డెవ‌ల‌ప్‌ మెంట్స్ ను చిన్న‌మ్మ‌తో చ‌ర్చించేందుకు వీలుగా.. దిన‌క‌ర‌న్ తాజాగా బెంగ‌ళూరు వెళ్ల‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. చీలిక వ‌ర్గాల ఏకంపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్న విష‌యాన్ని ప‌లువురు మంత్రులు నిజ‌మేన‌ని చెప్ప‌టం.. ఈ ప్ర‌తిపాద‌న‌ను దిన‌క‌ర‌న్ చెన్నైకి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెబుతున్న‌ట్లు తెలుస్తోంది. ప‌న్నీరు న‌డిపిస్తున్న తాజా గేమ్ కానీ వ‌ర్క్ వుట్ అయితే.. అన్నాడీఎంకే నుంచి చిన్న‌మ్మ‌.. దిన‌క‌ర‌న్ ల‌ను బ‌య‌ట‌కు పంప‌టం ఖాయ‌మ‌న్న‌వాద‌న వినిపిస్తోంది. పార్టీ గుర్తు అయిన రెండాకుల కోస‌మే ఈ క‌ల‌యిక ఉండాల‌న్న‌ట్లు చెబుతున్నా.. టార్గెట్ చిన్న‌మ్మ అన్న‌ది నిజ‌మ‌ని ప‌లువురు చెబుతుండ‌టం గ‌మనార్హం. ఏమైనా రానున్న‌ రెండు రోజుల్లో.. ఊహించ‌ని ప‌రిణామాల‌కు అవ‌కాశం ఉందంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/