Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ మార్కు ఆన్స‌ర్లు విన్నారా?

By:  Tupaki Desk   |   2 July 2017 8:10 AM GMT
చిన్న‌మ్మ మార్కు ఆన్స‌ర్లు విన్నారా?
X
త‌మిళ‌నాట అధికార అన్నాడీఎంకేలో ఇప్పుడు గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. పార్టీ అధినేత్రిగానే కాకుండా రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉండ‌గానే జ‌య‌ల‌లిత మ‌ర‌ణించారు. దాదాపు 70 రోజుల‌కు పైగా చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్న జ‌య‌... కోలుకుంటున్న స‌మ‌యంలో గుండెపోటు రావ‌డంతో క‌న్నుమూశారు. ఆ త‌ర్వాత అమ్మ స్థానంలో ఆమె వీర విధేయుడు ప‌న్నీర్ సెల్వం సీఎం పీఠాన్ని అధిష్టించ‌గా, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌విలో జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ కూర్చున్నారు. సీఎం ప‌ద‌విని కూడా చేజిక్కించుకునేందుకు శ‌శిక‌ళ చేసిన ముమ్మ‌ర య‌త్నాలు ఫ‌లించ‌క‌పోగా, అప్ప‌టిదాకా విచార‌ణ‌లో ఉన్న అవినీతి కేసులో ఏకంగా ఆమె జైలుపాలు కావాల్సి వ‌చ్చింది. జైలుకెళ్లే స‌మ‌యంలో త‌న మేన‌ల్లుడు టీవీవీ దిన‌క‌ర‌న్‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించిన ఆమె... అత‌డిని పార్టీ ఉప ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించింది.

అంత‌కుముందే... ప‌న్నీర్ సెల్వాన్ని సీఎం కుర్చీ నుంచి దించేసిన శ‌శిక‌ళ‌... త‌న‌కు విధేయుడిగా ఉన్న ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామిని సీఎం చేసేశారు. ఇప్పుడు ప‌ళ‌నిని సీఎం కుర్చీ నుంచి దించేసేందుకు అటు ప‌న్నీర్ వ‌ర్గం, ఇటు దిన‌క‌ర‌న్ వ‌ర్గం త‌మదైన శైలిలో పావులు క‌దుపుతున్నారు. వెర‌సి ఇప్పుడు ఆ పార్టీలో నేత‌లు, కార్య‌క‌ర్త‌లంతా మూడు వ‌ర్గాలుగా చీలిపోయారు. ఈ వ‌ర్గాల‌న్ని ఒక్క‌టిగా క‌లిసే దాఖ‌లా అస‌లు క‌నిపించ‌డ‌మే లేద‌న్న‌ది తంబీల మాట‌. ఇదంతా ఇలా ఉంటే... జ‌య టీవీకి ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల కొనుగోళ్ల‌కు సంబంధించి డాల‌ర్ల చెల్లించార‌న్న కేసులో శ‌శిక‌ళ విచార‌ణ ఎదుర్కొంటున్నారు.

ప్ర‌స్తుతం బెంగ‌ళూరు ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార కేసులో విచార‌ణ ఖైదీగా ఉన్న శ‌శిక‌ళ‌ను నిన్న చెన్నైలోని ఎగ్మూర్ ఆర్థిక నేరాల కోర్టు న్యాయ‌మూర్తి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విచారించారు. ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి సంధించిన ప్ర‌శ్న‌ల్లో చాలా వాటికి శ‌శిక‌ళ చాలా తెలివిగా స‌మాధానాలు చెప్పిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. *తెలియ‌దు* - *గుర్తు లేదు* వంటి స‌మాధానాల‌తో శ‌శిక‌ళ విచార‌ణ‌ను ఎదుర్కొన్నార‌ట‌. నేరాల్లో ఆరితేరిపోయిన నిందితులే ఈ త‌ర‌హా స‌మాధానాలు చెబుతుంటార‌ని విచార‌ణ అధికారులు చెబుతున్న విష‌యం తెలిసిందే. జ‌య మ‌ర‌ణంతో ఏకాకిగా మారిన శ‌శిక‌ళ కూడా కేసుల నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలోనే ఇలాంటి స‌మాధానాలు చెబుతున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల క‌థ‌నం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/