Begin typing your search above and press return to search.

త‌మిళ సీఎం పీఠంపై చిన్న‌మ్మ‌?

By:  Tupaki Desk   |   4 Feb 2017 6:49 AM GMT
త‌మిళ సీఎం పీఠంపై చిన్న‌మ్మ‌?
X
త‌మిళ రాజకీయాలు మ‌రోమారు వేడెక్కాయి. మొన్న‌టిదాకా జ‌ల్లిక‌ట్టు ఉద్య‌మం నేప‌థ్యంలో కాస్తంత నెమ్మ‌దించిన రాజ‌కీయం... ఆ ఉద్య‌మం స‌ద్దుమ‌ణగ‌గానే మ‌ళ్లీ వేడెక్కింది. త‌మిళ‌నాడు సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త అన్నాదురై జ‌యంతిని పుర‌స్క‌రించుకుని నిన్న అన్నాడీఎంకే నేత‌లంతా ఆయ‌న స‌మాధి వ‌ద్ద‌కు క్యూ క‌ట్టారు. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో చిన్న‌మ్మ శ‌శిక‌ళ కూడా అన్నాదురై స‌మాధి వ‌ద్ద‌కెళ్లి నివాళి అర్పించారు. ఆమె వెంట పార్టీ ముఖ్య‌నేతంతా ఉన్నారు. ఆ త‌ర్వాత ఒక్క‌సారిగా నేతలంతా పోయెస్ గార్డెన్‌ లోని దివంగ‌త‌ సీఎం జ‌య‌ల‌లిత నివాసానికి భారీ సంఖ్య‌లో త‌ర‌లివెళ్లారు. జ‌య మ‌ర‌ణం త‌ర్వాత ఆ నివాసంలో శ‌శిక‌ళ త‌న కుటుంబంతో క‌లిసి ఉంటున్న విష‌యం తెలిసిందే. శ‌శిక‌ళను క‌లిసేందుకే నేతలంతా అక్క‌డికి క్యూ క‌ట్టార‌ట‌. అయినా ఇప్పుడు శ‌శిక‌ళ వ‌ద్ద‌కు ఒకేసారి నేత‌లంతా క్యూ క‌ట్టాల్సిన అవ‌స‌రం ఏమీ లేకున్నా... నేత‌ల బారుల‌ను చూసిన వారు ఏదో జ‌రుగుతోందంటూ ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

ఇదిలా ఉంటే... జ‌య బ‌తికున్నంత కాలం ఆమె పాల‌న‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి షీలా బాలకృష్ణ‌న్ తాజాగా త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. షీలాతో పాటు సీఎంఓలోని మ‌రో కీల‌క అధికారిని ప్ర‌భుత్వం అక్క‌డి నుంచి త‌ప్పించేసింది. ఈ ప‌రిణామాలు చూస్తుంటే... త‌మిళ‌నాడు సీఎం పీఠంపై ఓ ప‌న్నీర్ సెల్వంను దించేసి శ‌శిక‌ళే ఆ ప‌దవిని అధిష్టించే అవ‌కాశాలున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఈ క్ర‌మంలోనే అన్నాదురై జ‌యంతిని వేదిక‌గా చేసుకుని శశిక‌ళ‌... త‌న బ‌ల‌గాన్ని చూపించార‌న్న వాద‌న లేక‌పోలేదు. మ‌రోవైపు రేపు అన్నాడీఎంకే శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం జ‌రుగుతోంది. ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల్లో అన్నాడీఎంకేఎల్పీ భేటీ ఇప్పుడు జ‌ర‌గాల్సిన అవ‌స‌రం కాని, అగ‌త్యం కానీ ఏమీ లేదు. అయితే... శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశాన్ని అత్య‌వ‌స‌రంగా నిర్వ‌హించేందుకు శశిక‌ళ నిర్ణ‌యించ‌డంపై ఆస‌క్తి నెల‌కొంది. ఈ ప‌రిణామాల‌న్నింటినీ ప‌రిశీలిస్తే... రేప‌టి స‌మావేశంలోనే శ‌శిక‌ళ‌కు సీఎం ప‌ద‌విని క‌ట్ట‌బెడుతూ అన్నాడీఎంకే కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలున్నాయ‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. అస‌లు ఈ స‌మావేశం కూడా ఇందుకోస‌మే జ‌రుగుతోంద‌ని చెబుతున్న వారు కూడా లేక‌పోలేదు.

వరుస‌గా చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు, అత్య‌వ‌స‌రంగా శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం నిర్వ‌హ‌ణ ఇందుకోస‌మేన‌న్న వాద‌న‌లో నిజం లేద‌ని చెప్ప‌డానికి కూడా ఏ ఒక్క‌రూ సాహ‌సించ‌డం లేదు. అంతేకాకుండా.. జ‌య‌కు న‌మ్మిన‌బంటుగా ఉన్న ప‌న్నీర్ సెల్వం కూడా సీఎం ప‌ద‌విని శ‌శిక‌ళ‌కు అప్ప‌గించేందుకు సిద్ధ‌ప‌డ ఇన‌ట్లు కూడా స‌మాచారం. ఇప్ప‌టికే జ‌య‌కు విశ్వాస‌పాత్రుడైన తెలుగు నేల‌కు చెందిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి రామ్మోహ‌న్‌ రావును సీఎస్ ప‌ద‌వి నుంచి త‌ప్పించేందుకు పెద్ద క‌స‌ర‌త్తే జ‌రిగింద‌న్న వాద‌న లేక‌పోలేదు. తాజాగా అమ్మ‌కు మ‌రో న‌మ్మిన‌బంటుగా ఉన్న షీలా బాల‌కృష్ణ‌న్‌, ఆ త‌ర్వాత ప‌న్నీర్ సెల్వంను కూడా సైడ్ చేసేందుకు శ‌శిక‌ళ ప‌క్కా ప‌థ‌క‌మే ర‌చించుకున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను అతి ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలిస్తున్న వారి అంచ‌నా ప్ర‌కారం... ఈ నెల 8 లేదంటే 9వ తేదీన శ‌శిక‌ళ త‌మిళ‌నాడు సీఎం ప‌ద‌విని చేప‌ట్ట‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/