Begin typing your search above and press return to search.

చిన్నమ్మ రిసార్ట్ క్యాంప్ ఖర్చు అంతా..?

By:  Tupaki Desk   |   14 Feb 2017 6:32 AM GMT
చిన్నమ్మ రిసార్ట్ క్యాంప్ ఖర్చు అంతా..?
X
తమిళ ప్రజల తలరాతల్ని సంపూర్ణంగా మార్చేయాలంటే తాను మాత్రమే సీఎం కుర్చీలో కూర్చోవాలని చిన్నమ్మ ఎంతలా తపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ చీఫ్ గా తాను.. సీఎంగా విధేయుడిగా పన్నీర్ ను పెట్టుకొని బండి లాగించేందుకు ఏమాత్రం ఇష్టపడని చిన్నమ్మ తీరుతో.. గడిచిన ఎనిమిది రోజులుగా తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభం ఎంతన్నది తెలిసిందే. తనపై పన్నీర్ తిరుగుబాటు బావుటాతో.. తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేల్ని తీసుకొని మహాబలిపరం సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్ లో క్యాంప్ ను పెట్టిన సంగతి తెలిసిందే.

దాదాపు 120 మంది ఎమ్మెల్యేలు.. అనుచరులతో భారీ ఎత్తున చేసిన ఏర్పాట్లు బాగానే ఉన్నా.. రిసార్ట్ బిల్లు ఎంతన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై కాస్త దృష్టిపెడితే.. సీఎం కుర్చీ చిన్నమ్మ పెడుతున్న ఖర్చు ఎంతన్నది అర్థమవుతుంది. రిసార్ట్ లో నిర్వహిస్తున్న క్యాంప్ ఖర్చుకు సంబంధించిన ఒక లెక్కను చూస్తే.. తక్కువలో తక్కువ ఎంత ఖర్చు కానుందన్న విషయంపై కాస్తంత స్పష్టత రావటం ఖాయం.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రిసార్ట్ లో వివిధ రకాలైన రూములు మొత్తంగా 60 ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో ఒక్కో రూమ్ కు రోజుకు కనిష్ఠంగా రూ.5500.. గరిష్ఠంగా రూ.9900 వరకు ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం రూమ్ లను టోకుగా బుక్ చేసుకున్నందున సరాసరిన రూ.7వేల వరకూ లెక్కలోకితీసుకుంటే.. ఆరు రోజులకు అద్దె కోసమే రూ.25లక్షలు ఖర్చు అవుతుందన్న అంచనా వినిపిస్తోంది.

ఇక.. రిసార్ట్స్ లో ఉన్న ఎమ్మెల్యేలు.. అనుచరులకు మంచినీళ్లు మొదలు స్నాక్స్.. టిఫిన్.. భోజనం లాంటి వాటితో పాటు రాత్రిళ్లు కూసింత చుక్క వేయటానికి కలిపి మొత్తంగా ఖర్చు వేస్తే.. సరాసరిన ఒక్కొక్కరికి తక్కువలో తక్కువ రూ.2వేల వరకు ఖర్చు అవుతుందని చెప్పాలి. అంటే.. 200 మందికి ఆరు రోజులకు అయ్యే ఖర్చు రూ.25లక్షల వరకూ ఉండొచ్చు.

పార్టీ ప్రధాన కార్యాలయానికి మీటింగ్ కు వచ్చిన ఎమ్మెల్యేల్ని.. మీటింగ్ ముగిసిన వెంటనే క్యాంప్ కు తరలించిన వైనం తెలిసిందే. దీంతో.. వారు రోజువారీగా బట్టలు వేసుకోవటానికి లేకపోవటంతో.. ఎమ్మెల్యేలకు అవసరమైన వస్త్రాల్ని అందించే బాధ్యతను చిన్నమ్మ వర్గమే చూసుకుంది. దీంతో.. రోజుకు ఒక్కొక్కరి వస్త్రాల ఖర్చు తక్కువేసుకుంటే రూ.2వేలుగా చూస్తే.. ఈ ఖర్చు ఆరు రోజులకు రూ.24లక్షలుగా చెప్పాలి. ఈ ఖర్చులతో పాటు.. వివిధ రకాల సదుపాయాల కోసం.. పెట్టేఖర్చు లెక్క వీటికిఅదనంగా చెప్పాలి. మొత్తంగా.. క్యాంప్ రాజకీయాలు ఎంత ఖరీదైనవన్న విషయం చిన్నమ్మ క్యాంప్ లెక్కను చూస్తే.. ఇట్టే అర్థమైపోతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/