Begin typing your search above and press return to search.

జైలులో చిన్న‌మ్మ తొలి పుట్టిన‌రోజు 'వేడుక‌'!

By:  Tupaki Desk   |   18 Aug 2017 9:34 AM GMT
జైలులో చిన్న‌మ్మ తొలి పుట్టిన‌రోజు వేడుక‌!
X
ప్ర‌తి ఒక్క‌రికీ పుట్టిన‌రోజు అంటే.. ఎంతో స్పెష‌ల్‌! అది సెలబ్రిటీల‌కైనా.. సాధార‌ణ పౌరుల‌కైనా ఆ రోజంటే ఎంతో ప్ర‌త్యేక‌మే!! ఉచ్ఛ స్థితిలో ఒక వెలుగు వెలిగి.. రాజ‌భోగాలు అనుభ‌వించిన వాళ్ల‌లో కొంద‌రు త‌ర్వాత ద‌శ‌లో అథఃపాతాళానికి ప‌డిపోతారు! ఇదే స‌మ‌యంలో వారి పుట్టిన‌రోజు ఎలా జ‌రుగుతంద‌నేది కూడా అంద‌రికీ ఆస‌క్తిక‌ర‌మే! ప్ర‌స్తుతం ఇదే ఆస‌క్తి అటు త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌తో పాటు.. ఇటు దేశ‌వ్యాప్తంగానూ నెల‌కొంది. త‌మిళనాడు మాజీ ముఖ్య‌మంత్రి - దివంగ‌త జ‌య‌ల‌లిత నెచ్చెలి - చిన్న‌మ్మ త‌న పుట్టిన రోజును బెంగ‌ళూరులోని ప‌ర‌ప్ప‌న్ జైలులో చేసుకోవ‌డం ఇప్పుడు అంద‌రిలోనూ ఆస‌క్తి మ‌రింత రెట్టింపు చేస్తోంది.

అమ్మ త‌ర్వాత అమ్మ పుట్టిన రోజు అంటే త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా మ‌న్నార్‌ గుడి మాఫియాలోని వ‌ర్గాలకు ఒక పండ‌గ లాంటిదే! అమ్మ ఉన్న సమ‌యంలో ఎంతో వేడుక‌గా వీటిని నిర్వ‌హించేవారు. ప్ర‌స్తుతం అక్ర‌మాస్తుల కేసులో చిన్న‌మ్మ‌.. జైలు జీవితం గ‌డుపుతున్నారు. ఇక్క‌డ సాధార‌ణ ఖైదీగా కాక‌.. అసాధార‌ణ ఖైదీగా ఆమె జైలులో రాజ‌భోగాలు అనుభ‌విస్తున్నార‌ని తెలియ‌గానే అంతా ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్య‌పోయారు. ఇదే త‌రుణంలో ఆమె పుట్టిన రోజు వేడుక‌లు రావ‌డంతో.. అంతా బెంగ‌ళూరు జైలుకు క్యూ క‌ట్టారు.

తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆశపడి చివరికి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు చేరిన చిన్నమ్మ శశికళ శుక్రవారం (ఆగస్టు 18వ తేదీ) మొదటి సారి కారాగారంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. శశికళకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడానికి మన్నార్ గుడి మాఫియా బెంగళూరులో మకాం వేసింది. అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ ఒక్క రోజు ముందుగానే గురువారం బెంగళూరు చేరుకుని జైల్లో శశికళ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జైల్లో ఇప్పటికే వీవీఐపీ మర్యాదలు స్వీకరిస్తున్న శశికళ.. తన పుట్టి రోజు వేడుకలు ఎంత ఘనంగా నిర్వహిస్తారో ఊహిస్తే అర్థం అవుతోంది. శశికళ పుట్టిన రోజు వేడుకల వివరాలు బయటకు రాకుండా చూడాలని బెంగళూరు పరప్పన అగ్రహార జైలు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నార‌ట‌.