Begin typing your search above and press return to search.

శశికళ ఇప్పుడేం చేస్తారు?

By:  Tupaki Desk   |   14 Feb 2017 8:29 AM GMT
శశికళ ఇప్పుడేం చేస్తారు?
X
శశికళకు జైలు శిక్ష పడడంతో ఆమె ప్లాన్ బీ అమలు చేయడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. తాను సీఎం కాకపోయినా ఫరవాలేదని.. ప్రత్యర్థి డీఎంకేకు కానీ, పార్టీలో ప్రత్యర్థి పన్నీర్ సెల్వంకు కానీ అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరాదని ఆమె గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె ముందుగానే ప్లాన్ బీ రెడీ చేసి పెట్టుకున్నారని తెలుస్తోంది. కానీ.. ఈ రోజు సుప్రీం తీర్పు తరువాత పరిణామాలతో ఆమె ప్లాన్ బీ అమలు చేయడం అంత సులభం కాకపోవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఈ రోజు జరగబోయే పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి.

అన్నాడీఎంకె పార్టీ మరి కొద్దిసేపటిలో మరొక సభ్యుడిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నది. ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశాలు తన చేజారిపోవడంతో శశికళ ఎమ్మెల్యేలతో చర్చలు ప్రారంభించారు. మరొకరిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని శశికళ శిబిరం నిర్ణయించింది. సెంగొట్టియన్‌, తంబిదురై, పళనిస్వామిల పేర్లను పరిశీలిస్తున్నారు. వీరిలో పళనిస్వామికి ఎక్కువ అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.

తీర్పు తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఏం చేయాలనేది శశి కళ ముందుగానే ఆలోచించుకున్నారట. తాను సీఎం కావాలనుకుని రంగంలోకి దిగిన తరువాత పన్నీర్ సెల్వం అడ్డం తిరగడంతో మొత్తం సీనంతా మారిపోయిన నేపథ్యంలో శశి ఈసారి జాగ్రత్తపడ్డారని చెబుతున్నారు. అందులో భాగంగానే పళని స్వామి, తంబిదురై, సెంగొట్టయన్‌ లలో ఎవరో ఒకరిని ముందు పెట్టి నడిపించాలన్నది ప్లాను. వీరిలో ప్రస్తుతం పార్టీ ప్రిసీడియం చైర్మన్ సెంగొట్టయన్ ఉన్నారు. ఈయన ఎమ్మెల్యేగా గెలవడం ఇది ఎనిమిదో సారి. అలాగే, తంబిదురై లోక్‌ సభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. ఇక కే పళని స్వామి మాత్రం ప్రస్తుతం తమిళనాడు జాతీయ రహదారులు, మైనర్‌పోర్ట్స్‌ శాఖను నిర్వహిస్తున్నారు.

శశి భర్త నటరాజన్ సెంగుట్టయన్‌ వైపు మొగ్గు చూపుతుండగా సుప్రీంకోర్టు నేపథ్యంలో పళనిస్వామిని ముఖ్యమంత్రిగా తీసుకొస్తే బావుంటుందని శశికళ భావిస్తున్నారట. అయితే.. తాజా పరిణామాల నేపథ్యంలో జయ మేనల్లుడు దీపక్‌ జయకుమార్‌కు కూడా ముఖ్యమంత్రిగా తెరపైకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/