Begin typing your search above and press return to search.

సిద్ధ‌ను బుక్ చేసిన చిన్న‌మ్మ రాజ‌భోగం

By:  Tupaki Desk   |   8 March 2018 1:04 PM GMT
సిద్ధ‌ను బుక్ చేసిన చిన్న‌మ్మ రాజ‌భోగం
X
ఎన్నిక‌ల వేళ చిన్న చిన్న విష‌యాలు కూడా ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేయ‌టం మామూలే. అందుకే.. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ పార్టీల‌న్నీ అలెర్ట్ గా ఉంటాయి. ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డ‌టానికి ముందే.. చేసుకోవాల్సిన ఏర్పాట్ల‌ను ప‌క్కాగా పూర్తి చేసుకోవ‌టం రాజ‌కీయ పార్టీల‌కు మామూలే.

ప్ర‌స్తుతం దేశ ప్ర‌జ‌ల దృష్టి క‌ర్ణాట‌క మీద కేంద్రీకృత‌మైంది. ఆ రాష్ట్రంలో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతోంది. క‌ర్ణాట‌క‌లో ప్ర‌స్తుతం కాంగ్రెస్ నేతృత్వంలో సిద్ధ‌రామ‌య్య ముఖ్య‌మంత్రిగా ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తున్నారు. ఆయ‌న‌కు ముందు బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉండేది. బీజేపీ అంత‌ర్గ‌త క‌ల‌హాలు.. గాలి ఎపిసోడ్ బీజేపీ ఇమేజ్ ను డ్యామేజ్ చేయ‌ట‌మే కాదు.. పాల‌నా ప‌గ్గాలు కాంగ్రెస్ చేతిలోకి వెళ్లేలా చేశాయి.

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రాభ‌వం అంత‌కంత‌కూ త‌రిగిపోతూ.. ఆ పార్టీ పాల‌న‌లో ఉన్న రాష్ట్రాల సంఖ్య త‌గ్గిపోతున్న వేళ‌.. క‌ర్ణాట‌క‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల మీద ఆస‌క్తి అంత‌కంత‌కూ పెరుగుతోంది.

దేశంలోని అన్ని ప్రాంతాల్లో పాగా వేస్తున్నా.. ద‌క్షిణాదిన ఖాతా ఓపెన్ చేయాల‌న్న త‌హ‌త‌హ మోడీ.. షా ద్వ‌యానికి ఉన్నా ప‌రిస్థితులు సానుకూలంగా ఉండ‌ట్లేదు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా వారి ఆశ‌లు నెర‌వేర‌టం లేదు. ఈశాన్యంలోనూ పాగా వేయ‌గ‌లిగిన‌ప్ప‌టికీ ద‌క్షిణాదిన జ‌య‌కేత‌నం వేయ‌లేక‌పోతున్నామ‌న్న బాధ బీజేపీ నేత‌ల్లో అంత‌కంత‌కూ పెరుగుతోంది. అందుకే.. స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డి క‌ర్ణాట‌క‌లో బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో క‌మ‌ల‌నాథులు ఉన్నారు.

అదే స‌మ‌యంలో కాంగ్రెస్ సైతం క‌ర్ణాట‌క ఎన్నిక‌లు పెద్ద ప‌రీక్ష‌గా మారాయి. అన్నిచోట్ల అప‌జ‌యం ఎదురువుతున్న వేళ‌.. క‌నీసం క‌ర్ణాట‌క‌లో అయినా గెలిచి ప‌రువు నిల‌బెట్టుకోవాల‌ని భావిస్తోంది. ఇందుకోసం తీసుకోవాల్సిన‌న్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఇలాంటివేళ‌.. సిద్ధ స‌ర్కారుకు ఇబ్బంది పెట్టే ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది. సిద్ధ స‌ర్కారుపై వేలెత్తి చూపించేందుకు వీలుగా చిన్న‌మ్మ వ్య‌వ‌హారం తాజాగా తెర మీద‌కు వ‌చ్చింది.

అమ్మ నెచ్చెలి శ‌శిక‌ళకు అక్ర‌మాస్తుల కేసులో జైలుశిక్ష ప‌డ‌టం తెలిసిందే. ఆమె క‌ర్ణాట‌క‌లోని ప‌ర‌ప్ప‌న అగ్ర‌హ‌ర జైల్లో శిక్ష అనుభ‌విస్తున్నారు. అయితే.. ఆమెకు జైల్లో రాజ‌భోగాలు అనుభ‌విస్తున్న వైనం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. జైల్లో చిన్న‌మ్మ‌కు అన్ని వ‌స‌తులు క‌ల్పిస్తున్నారంటూ వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ద‌ర్యాఫ్తు చేస్తున్న క‌మిటీకి స‌త్య‌నారాయ‌ణ అనే మాజీ పోలీసు ఉన్న‌తాధికారి చెప్ప‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

చిన్న‌మ్మ‌కు ఖ‌రీదైన ప‌రుపు.. దిండ్లతో పాటు అన్ని ర‌కాల స‌దుపాయాలు క‌ల్పిస్తున్నట్లుగా ఆయ‌న చెప్పారు. ఇందుకు సిద్ధ‌రామ‌య్య కూడా మాట సాయం చేశార‌న్న మాట ఇప్పుడు ఆయ‌న్ను ఇరుకున పెట్టేలా చేస్తోంది. సిద్ధ పాల‌నా వైఫ‌ల్యం కింద ఆయ‌న‌పై విమ‌ర్శ‌ల దాడి చేసేందుకు బీజేపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. చిన్న‌మ్మ‌కు ప్ర‌త్యేక వ‌స‌తులు క‌ల్పించ‌టం కోసం రూ2 కోట్లు ఆమె రావ‌టానికి ముందే అందిన‌ట్లుగా రూపా అనే పోలీసు అధికారి గతంలో బ‌య‌ట‌పెట్టిన నేప‌థ్యంలో స‌త్య‌నారాయ‌ణ మాట క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పిగా మారింది.