Begin typing your search above and press return to search.

గోల్డెన్ రిసార్ట్సులో శశికళ ఐరన్ లెగ్

By:  Tupaki Desk   |   16 Feb 2017 8:13 AM GMT
గోల్డెన్ రిసార్ట్సులో శశికళ ఐరన్ లెగ్
X
చెన్నై సమీపంలోని కూవత్తూరు గోల్డెన్ బే రిసార్టుకు ఒకప్పుడు మంచి పేరే ఉండేది. కానీ.. తమిళనాడు రాజకీయాల దెబ్బకు.. శశికళ అక్కడ తన శిబిరం నిర్వహించిన ప్రభావం వల్ల ఆ రిసార్టు అంటే ఉన్న మంచి ఇంప్రెషన్ పోయి చెడు ముద్ర ఏర్పడిపోయింది. నేరగాళ్లకు.. రహస్య కార్యకలాపాలకు - రౌడీయిజానికి అది నిలయమంటూ ఇప్పుడు దాని గురించి నెటిజన్లు కామెంట్లు రాస్తున్నారు. ప్రముఖ ట్రావెల్ వెబ్ సైట్లన్నిట్లోనూ ఇప్పుడు గోల్డెన్ బే రిసార్ట్సు రేటింగ్ దారుణంగా పడిపోయింది. గూగుల్ లోనూ దాని రేటింగ్ పాతాళానికి పడిపోయింది. రివ్యూలైతే దారుణంగా ఉంటున్నాయి.

సీఎం పీఠం కోసం పోరు మొదలైనప్పటి నుంచి తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను గోల్డెన్ బే రిసార్ట్స్ కు శశికళ తరలించిన విషయం తెలిసిందే. సుమారు 100 మంది ఎమ్మెల్యేలతో శశి అక్కడ శిబిరం నిర్హహించారు. వారిని బయటకు రాకుండా నిర్బంధించారు. మందు, విందు వంటి అన్ని ఏర్పాట్లు అక్కడే చేశారు. వారు ఎవరితోనూ కమ్యూనికేషన్లు జరపకుండా ఇంటర్నెట్ - వైఫై సేవలు ఆపేశారు. మొబైల్ ఫోన్లు పనిచేయకుండా చేశారు. అయితే.. ఇంత చేసినా శశి సీఎం కాలేదు. పైగా రాజకీయ పరిణామాలు - హై డ్రామా - అక్రమాస్తుల కేసులో శశికళకు జైలు శిక్ష పడటం వంటి ప్రభావం ఈ రిస్టార్ట్స్ పై పడ్డాయి.

దీనిపై ఇంటర్నెట్ లో నెగటివ్ రివ్యూలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ రిసార్ట్స్ లో భద్రత ఉండదని, అక్కడ పొలిటికల్ మాఫియా ఉందని, క్రిమినల్స్ చాలా తేలికగా ఈ రిసార్ట్స్ లో తలదాచుకోవచ్చని, అవసరమైతే సురక్షితంగా బయటకు వెళ్లిపోవచ్చని రివ్యూలు రాస్తున్నారు. ఇక్కడకు వస్తే ఒక్కో మనిషి చుట్టూ నలుగురు రౌడీలను కాపలా పెడతారని కూడా కొందరు తీవ్ర కామెంట్లు చేశారు. దీంతో, ఈ రిసార్ట్స్ కు గూగుల్ లో వస్తున్న రేటింగ్స్ పడిపోయాయి. అలా శశికళ దెబ్బకు రిసార్ట్సు యజమానికి భారీ నష్టమే కలిగింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/