Begin typing your search above and press return to search.

అజ్ఞాతంలోకి శ‌శిక‌ళ భ‌ర్త‌

By:  Tupaki Desk   |   4 May 2017 4:54 PM GMT
అజ్ఞాతంలోకి శ‌శిక‌ళ భ‌ర్త‌
X
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో క‌ర్ణాట‌క‌లోని పరప్పన అగ్రహార జైలుకు పరిమితం అయిన చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌కు భారీ షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే అధినేత్ర జయలలిత మరణం అనంత‌రం పార్టీని గుప్పెట్లోకి తీసుకుని తమిళనాడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని కలలు కన్న శ‌శిక‌ళ కుటుంబంపై ఐటీ గురి పెట్టిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మొద‌ట శ‌శిక‌ళ‌, ఆ త‌ర్వాత ఆమె అక్క వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ టార్గెట్ గా సాగిన ఆప‌రేష‌న్ ఇప్పుడు చిన్న‌మ్మ ఆస్తుల మీద ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో శ‌శిక‌ళ భ‌ర్త న‌ట‌రాజ‌న్ అజ్ఞాతంలోకి వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఎర వేశారని నమోదు అయిన కేసులో ఢిల్లీ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలోనే మకాం వేసిన అధికారులు టీటీవీ దినకరన్ పుట్టుపూర్వోత్తరాలు బయటకు లాగుతున్నారు. ఆయన కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. చిన్న‌మ్మ అక్ర‌మాస్తుల‌ను తేల్చ‌డంలో ప‌డ్డ ఢిల్లీ పెద్ద‌లు ఇప్పటికే శశికళకు చెందిన అనేక అక్రమ ఆస్తుల వివరాలు ప‌రిశీలిస్తున్నారని సమాచారం. తమిళనాడు ప్రభుత్వ పర్యవేక్షణలోని టాస్మాక్ వైన్ షాప్ లకు భారీ మొత్తంలో మద్యం సరఫరా చేస్తున్న మిడాస్ లిక్కర్ కంపెనీ, జాజ్ సినిమాస్, ఓ దినపత్రిక, జయ టీవీ తదితర ఆస్తులు శశికళ బినామీ పేర్లతో ఉన్నాయని, అందులో ఆమెకు ఎన్ని షేర్లు ఉన్నాయి, మిగిలిన షేర్లు ఎవరిపేరుతో ఉన్నాయని ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారని అంటున్నారు.

కేవ‌లం ఆస్తుల గురించి ఆరా తీయ‌డ‌మే కాకుండా ఆమె మ‌నుషుల‌పై సైతం క‌న్నేసి పెట్టార‌ని అంటున్నారు. శశికళ భర్త నటరాజన్, శశికళ సోదరుడు దివాకరన్, శశికళ వదిన ఇళవరసి కుమారుడు, జాజ్ సినిమాస్ సీఈవో వివేక్, శివకుమార్, వెంకటేష్, అనురాధ తదితరుల మీద ఐటీ శాఖ అధికారులు నిఘా వేశారని, ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశం ఉందని తమిళ మీడియాలో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ వార్త‌ల నేప‌థ్యంలో చిన్న‌మ్మ భ‌ర్త గాయ‌బ్ అవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదే స‌మ‌యంలో శశికళ కుటుంబ సభ్యులు కొత్త పార్టీ పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. బుధవారం రాత్రికిరాత్రే టీటీవీ దినకరన్ పేరవై పేరుతో ఫ్లెక్సీలు - పోస్టర్లు దర్శనం ఇచ్చాయి. విషయం తెలుసుకున్న ఐటీ శాఖ అధికారులు రంగంలోకి దిగారని సమాచారం. ఇదే సందర్బంలో శశికళ భర్త నటరాజన్ అజ్ఞాతంలో వెళ్లిపోవడంతో తీవ్రస్థాయిలో చర్చ మొదలైయ్యింది. కాగా, మ‌న్నార్ గుడి మాఫియాగా పేరొందిన చిన్న‌మ్మ‌ కుటుంబ సభ్యులు ఈ ప‌రిణామంపై స్పందించ‌డానికి నిరాక‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/