Begin typing your search above and press return to search.

నో డౌట్.. శశికళది జయలలిత రేంజే..

By:  Tupaki Desk   |   17 Feb 2017 6:44 AM GMT
నో డౌట్.. శశికళది జయలలిత రేంజే..
X
దేశంలో మహిళా సీఎంలందరి రాజకీయ చరిత్ర, వారు ఎదిగిన తీరు చూస్తే ముగ్గురు మహిళా సీఎంలు ప్రత్యేకంగా నిలుస్తారు. ముఖ్యమంత్రులుగానే కాకుండా వారు తమతమ పార్టీలకు అధినేతలుగానూ తిరుగులేని నాయకత్వం వహించినవారు. అందుకే... రాజకీయంగా వారితో విభేదించేవారు కూడా వారి సామర్థ్యాలు, సత్తా, వ్యూహాలు, గుండె ధైర్యం, ప్రతికూలతలను ఎదిరించి నిలిచిన వైనాన్ని మెచ్చుకోక మానరు. జయలలిత - మాయావతి - మమతాబెనర్జీ... ఈ ముగ్గురూ అందుకు ప్రబలమైన ఉదాహరణలు. జయ - మాయావతిలు సొంత పార్టీల నుంచి అవమానాలు పడి అదే పార్టీలకు హోల్ అండ్ సోల్ నేతలుగా ఎదిగి నియంతల స్థాయిలో నడిపించినవారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఇబ్బందులనూ తట్టుకుని నిలిచిన సమర్థులు. మమత విషయానికొస్తే ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ను స్థాపించినది ఆమే. అయితే... బెంగాల్ లో కమ్యూనిస్టులతో కొట్లాడి మరీ వారి దశాబ్దాల పాలనకు చరమగీతం పాడిన లీడర్ ఆమె. ముగ్గురూ ముగ్గురే. కేంద్రంలోని బలమైన ప్రభుత్వాలతో ఢీ అంటే ఢీ అని నిలబడినవారు. రాజస్థాన్ లో వసుంధర రాజె - యూపీలో ఉమా భారతి వంటివారు కూడా బలమైన నేతలు - ఫైర్ బ్రాండ్ నేతలే అయినా వీరు ముగ్గురిలా కాదు. వీరి ముగ్గురి సరసన భవిష్యత్తులో శశికళ చేరుతుందన్న అంచనాలు కనిపిస్తున్నాయి.

గత కొన్ని రోజులుగా తమిళనాడులో జరిగిన పరిణామాలు. ఇంతవరకు తెరముందుకు రాకపోయినా... తెర వెనుక రాజకీయాలకే పరిమితం అయినా.. అనుకున్నది తొలి ప్రయత్నంలో సాధించలేకపోయినా కూడా తొలిసారి ఆమె చూపించిన ధైర్యం - చేసిన శపథం.. కేంద్రంతో ఢీకొట్టిన తీరు.. రాష్ట్రంలో విపక్షం డీఎంకే.. కేంద్రంలో వ్యతిరకేంగా పనిచేస్తున్న బీజేపీ అన్నీ కలిసి తనకు అడ్డం పడినా కూడా తన వర్గాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకున్న తీరు అన్నీ కలిసి శశిని భవిష్యత్ టఫ్ నట్ గా సూచిస్తున్నాయి. జయ మాదిరిగానే ఆమె దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలుస్తారని.. దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించొచ్చని.. ఇప్పుడు వ్యతిరేకించేవారు కూడా భవిష్యత్తులో ఆమెతో కలిసి పనిచేయొచ్చని భావిస్తున్నారు.

ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. శశి జైలుకెళ్లే వరకు కూడా ఏమాత్రం తగ్గలేదు. తనకు ఈ గతి పట్టించినవారిపై రివెంజ్ తీర్చుకుంటానని శపథం చేసింది. కేంద్రంతో బేరసారాలకు ఏమాత్రం ప్రయత్నించలేదు. డీఎంకే ఎత్తులను పారనివ్వలేదు. పన్నీర్ వైపు తన వర్గం వెళ్లకుండా ఆపగలిగారు. అంతేకాదు.. జైలుకెళ్లేముందు పార్టీలో అంతా తన మాటే నడిచేలా ఏర్పాట్లు చేసుకుంది. జైలు నుంచి నడిపిస్తానని క్లియర్ ఇండికేషన్లు ఇచ్చి వెళ్లింది. నైతికంగా, చట్టపరంగా, రాజ్యాంగపరంగా ఈ వ్యవహారంలో ఎన్నో తప్పుడు విధానాలు ఉండొచ్చు కానీ మంచో, చెడో నాయకత్వ పటిమ విషయంలో మాత్రం శశికళ ను శభాష్ అనక తప్పదు.

సో.. శశి జైలు జీవితం పూర్తయి బయటకొచ్చాక ఆమె తమిళనాడులో మరో జయలలిత కావడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. భారత రాజకీయాల్లో మరో మహిళాశక్తి ఉద్భవించడానికి ఈ పరిణామాలు దోహదపడ్డాయనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/