Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ...ఓ ముగిసిన అధ్యాయం

By:  Tupaki Desk   |   20 Aug 2017 4:29 AM GMT
చిన్న‌మ్మ...ఓ ముగిసిన అధ్యాయం
X
త‌మిళ‌నాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు మెరీనా బీచ్‌ లో ముగిసిన కొద్ది రోజులకే మొదలైన ఈ రాజకీయ క్రీడ ఇప్పుడు ఓ కొలిక్కి వస్తోంది. జయ 2016 మే లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కొద్ది నెలలకే డిసెంబర్ 5న 75 రోజులకు ఆసుపత్రిలో కన్నుమూశారు. అనంతరం నెల‌కొన్న ప‌రిణామాల్లో భాగంగా రెండాకుల పార్టీలో మూడు చీలిక‌లు వ‌చ్చాయి. మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం - చిన్న‌మ్మ శ‌శిక‌ళ - ప్ర‌స్తుత సీఎం ప‌ళ‌నిస్వామి వ‌ర్గాలుగా మూడు చీలిక‌లు వ‌చ్చాయి. తమిళనాడు అధికార పార్టీ వర్గాలు రెండూ విలీనం కానున్నాయన్న ఆశలు పుంజు కొన్నాయి. అవినీతి కేసులో జైలులో ఉన్న శశికళ వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి తీర్మానాలను ఆమోదించడంతో ఇప్పుడు అందరి కళ్లూ ఆమె భ‌విష్య‌త్‌ పై ప‌డ్డాయి.

గత ఫిబ్రవరిలో ఎఐఎడిఎంకెలో మొదటగా తిరుగుబాటు జెండా ఎగురనేసింది పన్నీర్ సెల్వం. ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత జయ మిత్రురాలు శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలోకి వచ్చారు. తనను రాజీనామా చేయాల్సిందిగా శశికళ బలవంతపెట్టారని, తాను ఆమె సారథ్యాన్ని అంగీకరించబోనని ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య జయ స్మారక ప్రదేశం వద్ద పన్నీర్ పదినిమిషాలపాటు ప్రార్థ‌న జరిపి ప్రకటించారు. ఆ తరువాత ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోడీతో సాన్నిహిత్యాన్ని పన్నీర్ పెంచుకొన్నారు. ఎమ్మెల్యే హోదాలోనే తరచూ ప్ర‌ధానిని కలుసుకునేవారు. ఇదే స‌మ‌యంలో శశికళ ముఖ్యమంత్రి అవ్వాలనుకొని తాత్కాలిక గవర్నర్‌ కు తెలిపితే ఆయన ఆ ప్రక్రియను వాయిదా పడేలా చేశారు. లెక్క చూపని ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడేదాకా వేచి వుండాలని బీజేపీ నియమించిన ఇన్‌ చార్జ్ గవర్నర్ సి.విద్యాసాగర్ రావు సూచించారు. చివరకు ఆ కేసులో శశికళ ఆమె బంధువులు ఇళ‌వరసి - విఎన్ సుధాకరన్‌ కు నాలుగేళ్ల జైలు శిక్షపడింది. ఒక్కొక్కరిపై రూ.5కోట్ల జరిమానా కూడా విధించారు. వారు ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.

అలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చేజారిపోవడంతో శశికళ తన విధేయుడైన పళనిస్వామిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి, మరో బంధువు టిటివి దినకరన్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిని చేశారు. ఆ విధంగా ఆమె అధికార పగ్గాలను తన చేతిలో ఉంచుకున్నారు. జయలలిత మరణంవల్ల ఖాళీ అయిన ఆర్‌ కెనగర్ సీటుకు ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా అది అనేక వివాదాల మధ్య నిలిచిపోయింది. అయితే ఆ ఉప ఎన్నికకు దినకరన్‌ ను ఎఐఎడిఎంకె(అమ్మ) అభ్యర్థిగా ప్రకటించారు. దీనితో పార్టీ ‘రెండాకులు’ గుర్తును తమ వర్గానికే కేటాయించాలని పన్నీర్ సెల్వం ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఆర్‌ కెనగర్ సీటుపై దినకరన్ ఆశలు పెంచుకున్నారు. ఓటర్లకు పెద్దఎత్తున డబ్బులు పంచారన్న కారణంపై ఆ ఉప ఎన్నిక చివరకు నిరవధికంగా రద్దు అయింది. అనంతరం అనేక పరిణామాల తర్వాత ఎఐఎడిఎంకెలోని రెండువర్గాలు ఏకమయ్యే అవకాశాలు మెరుగుపడ్డాయి. అయితే శశికళను - ఆమె వర్గం మొత్తాన్ని పార్టీ నుంచి బహిష్కరించాలని సెల్వం వ‌ర్గం ప‌ట్టుబ‌ట్టి ముందుకు సాగుతుండ‌టంతో..ఇప్పుడు ఆమె భ‌విష్య‌త్‌ పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. తాజా, మాజీ సీఎంలు ఏక‌మ‌వ‌డం - జైలులో ఉన్న చిన్న‌మ్మ ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తారో క్లారిటీ లేక‌పోవ‌డం...ఢిల్లీలో కూడా అనుకూల ప‌రిణామాలు లేక‌పోవ‌డంతో చిన్న‌మ్మ చాప్ట‌ర్ ఇక క్లోజ్ అయిన‌ట్లేన‌ని త‌మిళ‌రాజ‌కీయ నేత‌లు అంటున్నారు.