Begin typing your search above and press return to search.

ఆమె చెబితేనే ‘అమ్మ’ దగ్గరకు రాహుల్ వచ్చారా?

By:  Tupaki Desk   |   11 Oct 2016 6:40 AM GMT
ఆమె చెబితేనే ‘అమ్మ’ దగ్గరకు రాహుల్ వచ్చారా?
X
రెండు వారాలకు పైనే చెన్నై అపోలో ఆసుపత్రిలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు తప్పించి మరొకరు వచ్చింది లేదు. అసలేం జరుగుతుందో అర్థం కాని వేళ.. ఆసుపత్రికి వచ్చిన విద్యాసాగర్ తర్వాతే అమ్మ ఆరోగ్యానికి ఢోకా లేదన్న విషయం స్పష్టమైంది. ఇదిలా ఉంటే.. అకస్మాత్తుగా.. ఎవరూ ఊహించని రీతిలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అమ్మను పరామర్శించేందుకు చెన్నై అపోలోకు రావటం ఆసక్తికరంగా మారింది. ఓపక్క యూపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రాహుల్..ఉన్నట్లుండి ఢిల్లీ నుంచి నేరుగా ప్రైవేటు విమానంలో చెన్నైలో ల్యాండ్ కావటం.. విమానాశ్రయం నుంచి నేరుగా అపోలోకు వచ్చిన ఆయన.. అక్కడి వైద్యులతో.. అన్నాడీఎంకే నేతలతో మాట్లాడి వెళ్లిపోయారు.

రాహుల్ గాంధీ వచ్చి వెళ్లిన తర్వాత నుంచి ఒక్కొక్క నేత ఆసుపత్రికి రావటం మొదలైంది. అన్నాడీఎంకేతో.. ఆ పార్టీ అధినేత్రితో అంత గొప్ప సంబంధాలు లేని కాంగ్రెస్ పార్టీ.. మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ అమ్మను పరామర్శించటానికి అంత ప్రత్యేకంగా ఎందుకు వచ్చినట్లు? అన్న ప్రశ్న పలువురి మదిలో మెదిలింది. ఈ అంశంపై ఆరా తీసినప్పుడు ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది.

యూపీఏ హయాంలో డీఎంకేకు మిత్రపక్షంగా వ్యవహరించిన కాంగ్రెస్ తాజాగా తమిళనాడు అధికారపక్షం అన్నాడీఎంకేకు దగ్గరయ్యే దిశగా పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. జయ స్థానంలో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న.. అమ్మ నెచ్చెలి శశికళ.. పార్టీకి జాతీయ పార్టీ అండ కోసం కాంగ్రెస్ తో చెలిమి చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆమె జరిపిన మంత్రాంగానికి ఫలితంగానే రాహుల్ గాంధీ ఆసుపత్రికి వచ్చి అమ్మను పరామర్శించిన‌ట్లు అందించినట్లు చెబుతున్నారు. రాహుల్ ను చెన్నైకి రప్పించటంలో జయలలిత సన్నిహితురాలు శశికళ కదిపిన పావులే కార‌ణ‌మ‌న్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/