Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ‌కు స్థాన‌భ్రంశం!

By:  Tupaki Desk   |   13 July 2017 1:57 PM GMT
చిన్న‌మ్మ‌కు స్థాన‌భ్రంశం!
X
బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళను వేరే జైలుకు త‌ర‌లించ‌నున్న‌ట్లు స‌మాచారం. చిన్న‌మ్మ‌ను అక్కడ నుంచి తరలించేందుకు రంగం సిద్ధం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. శశికళ తనకు కారాగారంలో సకల సౌకర్యాలు అందేందుకు జైలు అధికారుల‌కు రూ.2 కోట్లు ఇచ్చార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఈ వ్యవహారంలో కర్ణాటక జైళ్లశాఖ డీజీపీ హెచ్‌ ఎన్‌ సత్యనారాయణరావుకు కూడా ముడుపులు అందాయని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. జైళ్లశాఖ డీఐజీ రూప ఈ వ్య‌వ‌హారంపై సంచలన విషయాలు వెల్ల‌డించ‌డంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో చిన్న‌మ్మ‌ను వేరే జైలుకు త‌ర‌లించే అంశం ప్రాధాన్యాన్ని సంత‌రించుకుంది.

రూప త‌న‌ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించుకున్నారు. తన నివేదికలో చెప్పిన ప్రతి విషయం వాస్తవమేన‌ని, అందులో ప్ర‌తి అంశానికి తాను కట్టుబడి ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. తనపై ఎవరి ఒత్తిడి లేదని, విచారణలో అన్ని విషయాలు వెలుగు చూస్తాయని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణ కొట్టిపారేశారు. శశికళకు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి సదుపాయాలు కల్పించలేదని తెలిపారు. తాను డబ్బులు తీసుకున్నట్లు డీఐజీ రూప భావిస్తే విచారణకు సిద్ధంగానే ఉన్నాన‌ని చెప్పారు.

కాగా, ఏడాదిన్నర లీవ్ తర్వాత బాధ్యతలు చేపట్టిన తనకు పరప్పన అగ్రహార జైలులో భారీ అక్రమాలు జరుగుతున్నట్లు తెలిసిందని రూప చెబుతున్నారు. ఆ జైల్లో జ‌రుగుతున్న అక్ర‌మాలపై విచారణ జ‌ర‌పాల‌న్నారు. స్టాంప్ పేపర్ స్కాంలో జైలుశిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ కరీమ్ తెల్గీకి కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారని రూప‌ లేఖలో పేర్కొన్నారు.