Begin typing your search above and press return to search.

చిన్నమ్మను సీఎం చేసే ముహుర్తం ఫిక్స్?

By:  Tupaki Desk   |   4 Jan 2017 4:43 AM GMT
చిన్నమ్మను సీఎం చేసే ముహుర్తం ఫిక్స్?
X
అమ్మ లేకున్నా చిన్నమ్మ ఉందిగా అన్నట్లుగా మారింది తమిళ రాజకీయం.నిన్నమొన్నటి వరకూ పార్టీ సభ్యత్వం లేని చిన్నమ్మ.. ఇప్పుడు పార్టీ ప్రధానకార్యదర్శి కావటమే కాదు.. సీఎం కుర్చీలో కూర్చునేందుకు సైతం రెఢీ అవుతున్నారు. అమ్మ మరణంతో విధేయుడు పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ.. ఆయన చేతిలో సీఎం పగ్గాలు ఉండటాన్ని చిన్నమ్మ ఇష్టపడటం లేదన్న విషయం తెలిసిందే.

దీనికి తగ్గట్లే.. చిన్నమ్మ సీఎం కుర్చీలో కూర్చోవాలంటూ మంత్రులు పలువురు పెద్ద ఎత్తున ప్రకటనలు చేయటం.. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై కాలికి బలపం కట్టుకున్నట్లుగా చిన్నమ్మను ముఖ్యమంత్రిని చేయాలంటూ జిల్లాల వారీగా తిరగటం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా సీఎం పదవిని చేపట్టేందుకు చిన్నమ్మ సిద్ధం కావటమే కాదు.. అందుకు తగ్గ ముహుర్తం కూడా డిసైడ్ చేశారని చెబుతున్నారు.

మొదట్లో వార్తలు వచ్చినట్లుగా.. చిన్నమ్మకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించేందుకు పన్నీరుసెల్వం అంత సుముఖంగా లేనట్లు చెబుతున్నా..అలాంటిదేమీ లేదన్నట్లుగా ఆయన ప్రతిరోజూ పోయెస్ గార్డెన్ కు వెళ్లి హాజరు వేయించుకోవటంతో పాటు.. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు ప్రతిదీ చర్చిస్తుండటం గమనార్హం.

తమిళులు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే పొంగల్ రోజు.. అంటే జనవరి 12న చిన్నమ్మ సీఎం పదవిని చేపట్టేందుకు వీలుగా ముహుర్తం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నారని.. అధికారికంగా ప్రకటించాల్సిఉందని చెబుతున్నారు. ఈ వాదన నిజమేనన్న రీతిలో మంగళవారం పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు (బుధవారం) ఉదయం 9.30గంటలకు తమిళనాడు మంత్రివర్గం అత్యవసరంగా భేటీ కానుంది. విశ్వసనీయన సమాచారం ప్రకారం.. ఈ క్యాబినెట్ మీటింగ్ లో చిన్నమ్మకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే..ఒకవైపు ప్రభుత్వ క్యాబినెట్ మీటింగ్ అత్యవసరంగా జరుగుతున్న వేళనే..మరోవైపు విపక్ష డీఎంకే పార్టీ సర్వ సభ్య సమావేశం కూడా నేడు జరగనుంది. ఈసమావేశంలో కరుణ తన వారసుడ్ని ప్రకటించటంతో పాటు.. పార్టీ పగ్గాల్నిఅందించి పట్టాభిషేకం చేసే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/