Begin typing your search above and press return to search.
చిన్నమ్మ ప్రశ్నః నేను జేబు దొంగనా?
By: Tupaki Desk | 17 Feb 2017 12:05 PM GMTఅన్నాడీఎంకే అధినేత్రి అనుంగ మనిషిగా ఎన్నో ఏళ్లుగా రాజభోగాలు అనుభవించిన శశికళకు జైలు జీవితం చుక్కలు చూపిస్తున్నట్లు ఉంది. భవిష్యత్తులో జైలు జీవితం ఎన్నో సవాళ్లే విసిరేలా ఉందని చిన్నమ్మకు తొలి రోజే ఆమెకు తెలిసొచ్చింది. అక్రమాస్తులు కేసులో భాగంగా కోర్టులో లొంగిపోయిన శశికళను పోలీసులు.. జీపులో జైలుకు తరలించాలని అనుకున్నారు. అయితే దానికి ఆమె నిరాకరించింది. ఓ జేబు దొంగలాగా జీపు ఎక్కడమేంటి? ఎంతదూరమైనా నడిచే వస్తా అంటూ ఆమె పోలీసులతో చెప్పడం గమనార్హం. నేనేమీ దొంగను కాను. పోలీస్ జీపులో కూర్చోను. సెల్ లో ఉంటానేమోగానీ.. ఓ సాధారణ దొంగలాగా ఓపెన్ పోలీస్ జీపులో రాను. ఎంత దూరమైనా నేను నడుస్తా అని శశికళ అన్నట్లు జైలు వర్గాలు వెల్లడించాయి. శశికళ బాడీ లాంగ్వేజీ చూస్తే జైలు శిక్ష ఆమెలో ఓ విధమైన ఆగ్రహాన్ని, అసహనాన్ని పెంచినట్లు కనిపించిందని జైలు అధికారులు చర్చించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తన మార్గదర్శి జయలలితతో కలిసి గతంలో జైలు జీవితం అనుభవించిన సమయంలోలాగే ఇప్పుడూ తనకు అన్ని వసతులు కల్పిస్తారని ఆమె భావించింది. అయితే అప్పట్లో జయకు ఆరోగ్య సమస్యలు ఉన్నందున అలాంటి వసతులు కల్పించారు. ఆమెతో పాటు శశికళకు కూడా అవే వసతులు ఇచ్చారు. అయితే ఈసారి పరిస్థితులు మారిపోయాయి. వీఐపీ ఖైదీగా పరిగణించడానికి కోర్టు అంగీకరించలేదు. మీరేమీ సీఎం కాదుగా ప్రత్యేక వసతులు కల్పించడానికి అని కోర్టు స్పష్టంచేసింది. బహుశా ఆమె అలా వ్యవహరించడానికి ఇదే కారణం కావచ్చు అని జైలు అధికారులు చెప్పారు. శశికళ తొలి రోజు జైలు జీవితం కూడా అలాగే గడిచింది. "ఆమె రాత్రంతా నిద్రపోలేదు. ఇళవరసితో కలిసి ఆమె ఒకే సెల్‌లో ఉంటోంది. ఇళవరసితో తప్ప ఆమె ఎవరితోనూ మాట్లాడటం లేదు. తమిళనాడులో ఏం జరుగుతున్నదన్న విషయం కూడా తెలసుకోవడానికి ఆమె ఆసక్తి చూపలేదు" అని జైలు అధికారులు వెల్లడించారు. ఆరోగ్య సమస్యల కారణంగా రెండో రోజు నుంచి చిన్నమ్మకు ఓ మంచం ఏర్పాటుచేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/