Begin typing your search above and press return to search.

అమ్మఆసుపత్రిలో ఉన్నా ప్రతీకారమేనట

By:  Tupaki Desk   |   26 Sep 2016 6:18 AM GMT
అమ్మఆసుపత్రిలో ఉన్నా ప్రతీకారమేనట
X
అమ్మ మనసును నొప్పించినోళ్ల కథ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. అదెలా ఉంటుందో తమిళనాడు రాజకీయాలు తెలిసిన వారు ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అందుకే అమ్మతో పెట్టుకోవటానికి కొమ్ములు తిరిగినోళ్లు సైతం వెనక్కి తగ్గుతుంటారు. అలాంటిది అమ్మతోనే పేచీ పెట్టుకోవటమే కాదు.. ఆమె ఆదేశాల్ని లైట్ తీసుకొని షాకిచ్చిన రాజ్యసభ సభ్యురాలు శశికళ ఉదంతం ఆ మధ్య సంచలనం సృష్టించింది.

డీఎంకే ఎంపీని ఎయిర్ పోర్ట్ లో చెంపదెబ్బ కొట్టటంతో పాటు.. అది వారి పర్సనల్ వ్యవహారంగా అభివర్ణించిన ఎపిసోడ్ పై అమ్మ ఆగ్రహానికి గురికావటం.. ఆమెను తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయాలంటూ అమ్మ ఆదేశించటం తెలిసిందే. అధినేత్రి మాటను తూచా తప్పకుండా పాటించే అన్నాడీఎంకే నేతల వైఖరికి భిన్నంగా శశికళ వ్యవహరించి.. తిరుబాటు జెండా ఎగురవేయటంతో ఆమెను పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

జ‌య‌ల‌లిత‌ నోటి నుంచి మాటలను కూడా పట్టించుకోని శశికళపై వేధింపులు మొదలైనట్లుగా చెబుతారు. ఆమెకు వ్యతిరేకంగా ఒకరి తర్వాత ఒకరుగా ఆరోపణలు.. ఫిర్యాదులు చేయటం షురూ అయ్యింది. మోసం.. లైంగిక వేధింపులు.. హత్య కేసుతో సహా పలు కేసులకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పనిమనిషిని లైంగిక వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో బెయిల్ కోసం ఆమె కోర్టులో పిటీషన్ దాఖలు చేయటం తెలిసిందే. అయితే.. సదరు డాక్యుమెంట్ల మీద శశికళ పేరిట ఉన్న సంతకాలు నకిలీవిగా తేలటంతో ఇప్పుడు మోసం.. కోర్టును తప్పుదారి పట్టించే యత్నం తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది.

ఇప్పటికే పలు కేసులు ఆమె మెడకు చుట్టుకోగా.. బెయిల్ మీద బండి లాగిస్తున్న ఆమెకు.. తాజా ఉదంతంలో మాత్రం అరెస్ట్ తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమ్మను ధిక్కరించిన శశికళకు.. ఆమె కుటుంబ సభ్యులకు ఎదురవుతున్న పరిణామాలతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఓ పక్క అమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా.. మరోవైపు ఆమెకు ఆగ్రహం తెప్పించిన శశికళ ఇష్యూను ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు మాత్రం ఆగకపోవటం గమనార్హం. అమ్మా.. మజాకా?