Begin typing your search above and press return to search.

మహిళా ఎంపీ.. రాజ్యసభలో కన్నీరు!

By:  Tupaki Desk   |   1 Aug 2016 8:00 AM GMT
మహిళా ఎంపీ.. రాజ్యసభలో కన్నీరు!
X
రాజ్యసభలో ఒక ఎంపీ కన్నీరు మున్నీరయ్యారు. తనప్రాణాలకు ముప్పుందని - రక్షణ కల్పించాలని చెబుతూ బోరున విలపించారు. సోషల్ మీడియాలోనూ - మీడియాలోనూ తన పరువుతీశారని - తనకు తగినంత భద్రత కల్పించాలని కోరుతున్నారు ఒక మహిళా ఎంపీ. అయితే.. రక్షణ కల్పించాలని కోరుతున్న మహిళా ఎంపీ.. ఒక విమానాశ్రయంలో మరో ఎంపీని చెంపదెబ్బ కొట్టడం గమనార్హం. మన నాయకులు ఎంత ఆదర్శప్రాయులో చెప్పే ఈ ఆసక్తికర సంఘటన ఢిల్లీలో జరిగింది.

విషయానికొస్తే... ఢిల్లీ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను అన్నాడీఎంకే కి చెందిన మహిళా ఎంపీ చెంపదెబ్బలు కొట్టారు. నాలుగు చెంపదెబ్బలు కొట్టానని ఈ మహిళా ఎంపీ చెప్పుకుంటే.. కాదు కాదు ఒక్కటే కొట్టారు అని డీఎంకే ఎంపీ చెప్పుకొచ్చారు. దెబ్బల సంఖ్యలో కాస్త క్లారిటీ లేకపోయినా.. శివ అనే ఎంపీని శశికల అనే ఎంపీ చెంపదెబ్బ కొట్టారనేది మాత్రం వాస్తవం. అయితే ఈ ఎంపీల చెంపదెబ్బల పంచాయతీ జయలలిత వద్దకు వెళ్లడంతో.. శశికళను రాజినామా చేయాలని జయ ఆదేశించారట. ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్థావిస్తూ రాజ్యసభలో కన్నీరుమున్నీరయ్యారు శశికళ.

ఇప్పటికే శశికళను పార్టీనుంచి సస్పెండ్ చేశారని తెలుస్తోన్న క్రమంలో.. తనకు ఉన్న రాజ్యాంగబద్ధమైన పదవి నుంచి రాజీనామా చేయాల్సిందిగా బలవంతం చేస్తున్నారని మొదలు పెట్టిన ఈ మహిళా ఎంపీ.. ఎవరు చెప్పినా తాను మాత్రం రాజీనామా చేసేది లేదని తేల్చి చెప్పారు. ఇద్దరు ఎంపీలు బహిరంగంగా ఒక విమానాశ్రయంలో చెంప దెబ్బలు కొట్టుకుంటే.. అది చిన్న విషయమన్నట్లు చెబుతున్న శశికళ.. చిన్నవిషయాన్ని పెద్ద విషయంగా చిత్రీకరిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఇదేమి చోద్యమో అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్న క్రమంలో.. తన పరువు తీసేలా సోషల్ మీడియాలో వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

కాగా ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చేందుకు శివ - శశికళ ల మధ్య ఢిల్లీ విమానాశ్రయంలో అందరూ చూస్తుండగానే గొడవ చోటు చేసుకోవడం.. తమ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమానాశ్రయ సెక్యూరిటీ వద్ద శివ అవహేళనగా వ్యాఖ్యలు చేయడంతోనే తాను నాలుగుసార్లు ఆయన చెంప పగలగొట్టినట్టు శశికళ చెప్పడం తెలిసిందే.