Begin typing your search above and press return to search.

‘శశికళ’ భర్తను రక్తం వచ్చేలా కొట్టారే

By:  Tupaki Desk   |   29 Dec 2016 4:20 AM GMT
‘శశికళ’ భర్తను రక్తం వచ్చేలా కొట్టారే
X
అన్నాడీఎంకే అంతర్గత రాజకీయాలు కొట్టుకునేవరకూ వచ్చాయి. ఇక్కడ చెబుతున్న శశికళ అంటే అమ్మ నెచ్చెలి చిన్నమ్మ కాదు.. అమ్మ మీద అగ్గి ఫైర్ అయి.. పార్టీ నుంచి బహిష్కరణ వేటు పడిన మాజీ అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప. అమ్మకు నెచ్చెలి.. అమ్మకు మంట పుట్టించి.. ఆమె ఆగ్రహానికి గురైన వ్యక్తి ఇద్దరి మొదటి పేర్లు శశికళే కావటాన్ని మర్చిపోకూడదు.

గురువారం జరగనున్న పార్టీ కార్యవర్గ సమావేశంలో పార్టీ తదుపరి రథసారధిని అధికారికంగా ఎంపిక చేయనున్నారన్న అంచనాల నేపథ్యంలో.. ఈ బహిష్కృత నేత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయటానికి అనువైన పత్రాల్ని సిద్ధం చేశారు. వీటిని తన భర్త లింగేశ్వర తిలకనతో పాటు లాయర్లను అన్నాడీఎంకే పార్టీ కార్యాలయానికి పంపారు. తాము శశికళ పుష్ప తరఫున వచ్చామని.. శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయాలని భావిస్తున్న విషయం నోటి వెంట వచ్చీరాక ముందే.. యాభైమంది శశికళ భర్తపై దాడి చేశారు.

పెద్ద ఎత్తున తిడుతూ.. ముష్టిఘాతాలు కురిస్తూ.. కిందపడినప్పటికి వదలకుండా కాళ్లతో తన్నుతూ రక్తం కారుతున్నా వదిలిపెట్టలేదు. చివరకు ఆయన్ను రక్షించిన పోలీసులు.. ఆయన్ను తమ సంరక్షణలోకి తీసుకొని ఆసుపత్రికి తరలించారు. ఇదిలాఉంటే పార్టీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించేందుకు శశికళ భర్త వచ్చారనిపార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయినా.. పార్టీలో బహిష్కరణ వేటు పడిన శశికళకు పార్టీ కార్యాలయంలోకి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. తన భర్త కనిపించటం లేదంటూ శశికళ పుష్ప బుధవారం రాత్రి మీడియాముందుకు వచ్చారు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన ఆమె.. తన భర్త ఆచూకీ తెలియజేయాలని కోరుతున్నారు. అమ్మను వ్యతిరేకించిన వారు.. అమ్మ ఆగ్రహానికి గురైన వారికి పార్టీలో పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయాన్ని శశికళభర్త ఉదంతంలో అన్నాడీఎంకే కార్యకర్తలు శాంపిల్ చూపించినట్లుగా లేదు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/