Begin typing your search above and press return to search.

చిన్నమ్మకు లేఖతో షాకిచ్చిన శశికళ

By:  Tupaki Desk   |   6 Feb 2017 8:02 AM GMT
చిన్నమ్మకు లేఖతో షాకిచ్చిన శశికళ
X
పార్టీ నేతలంతా ఓకే అనేశారు. ఎమ్మెల్యేలంతా చిన్నమ్మ వెనుకనే ఉంటామన్నారు. ఇక.. సీఎంగా ఉన్న పన్నీరు సెల్వం తన కుర్చీని ఇచ్చేందుకు విధేయతతో ముందుకు వచ్చారు. ఇలాంటి పరిణామాలు ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకున్నాక చిన్నమ్మ అలియాస్ శశికళా నటరాజన్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవటమే తరువాయి అన్న మాట వినిపించింది. అయితే.. అంతలోనే పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

మరో మూడు రోజుల్లో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని ఆరాటపడుతున్న శశికళకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో నిందితురాలైన శశికళ కేసుకు సంబంధించిన తీర్పు మరో వారం రోజుల్లో వస్తుందని చెబుతున్నారు. ఇలాంటి వేళ.. కేసు నుంచి బయటపడకుండానే సీఎం పదవిని చేపట్టటం సరైనదేనా? అందుకు న్యాయపరమైన అంశాలు అడ్డరావా? అన్నది ప్రశ్నగా మారింది.

ఇదిలాఉంటే.. అన్నాడీఎంకే బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళా పుష్ప తాజాగా ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. శశికళకు ఉన్న క్రిమినల్ నేపథ్యాన్ని అందులో ప్రస్తావించటమే కాదు.. ఆమె పలు కేసుల్లో నిందితురాలిగా ఉందని పేర్కొన్నారు. అక్రమాస్తుల కేసుల్లో జయలలితతో పాటు శశికళ మీద కూడా ఆరోపణలుఉన్నాయని.. అమ్మ నిర్దోషి అని కోర్టులు తేల్చాయని.. చిన్నమ్మ మీద ఉన్న కేసులు ఇంకా కోర్టులోనే ఉన్న విషయాన్ని ఆమె గుర్తు చేస్తున్నారు.

అమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ముఖ్యమంత్రి పదవికి చిన్నమ్మ పేరును జయలలిత సూచించకుండా.. పన్నీరు సెల్వంకు బాధ్యతలు అప్పగించారని.. నేర చరిత ఉన్న శశికళను ముఖ్యమంత్రిగా చేస్తే.. తమిళనాడు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు ఎక్కువ అవుతాయని ఆరోపించారు.

ఈ సమస్యలు సరిపోవన్నట్లుగా ఛేంజ్.ఆర్గ్ అనే సంస్థ ఆదివారంరాత్రి నుంచి శశికళ ముఖ్యమంత్రి కావటంపై ఆన్ పోల్ ను నిర్వహిస్తున్నారు. ఈ పోల్ ను స్టార్ట్ చేసిన 15 నిమిషాల్లోనే చిన్నమ్మకు వ్యతిరేకంగా 19వేల మంది సంతకాలు పెట్టారని.. తమంతా చదువుకున్న.. తెలివైన జయకు ఓటు వేశామని.. ఇతరులకు కాదనివారు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించటం గమనార్హం. అవసరమైతే మరోసారి ఎన్నికలు నిర్వహించాలే కానీ.. ఇతరులకు పదవులు అప్పగించకూడదన్న వాదనను వారు తెర మీదకుతీసుకొచ్చారు. 35వేల మంది సంతకాలు పెట్టాల్సి ఉండగా.. ఇప్పటికి 32,150 మంది సంతకాలు పెట్టారని.. అనుకున్నట్లుగా సంతకాలసేకరణ పూర్తి కాగానే.. తమ వాదనను రాష్ట్రపతి.. గవర్నర్ కు అందజేస్తామని సదరు సంస్థ చెబుతోంది.

ఈ సంస్థ నిర్వహిస్తున్న ఆన్ లైన్ పోలింగ్ లో పాల్గొంటున్న పలువురు నెటిజన్లు.. చిన్నమ్మపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటిల్లోకి కొన్ని అభ్యంతరకరంగా ఉండటమే కాదు.. శశికళ మీద తమకున్న కోపాన్ని ప్రదర్శించేలా ఉండటం గమనార్హం. నెటిజన్లు పోస్ట్ చేసిన కొన్ని వ్యాఖ్యల్ని చూస్తే...

= ఆమె ముఖ్యమంత్రి అయితే మన్నార్ గుడి మాఫియా పాలన వస్తుంది. ఆమెను ఇక్కడితో ఆపేయండి.

= హౌస్ కీపింగ్ చేసిన ఓ మహిళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావడాన్ని వ్యతిరేకిస్తున్నా. రాష్ట్రాన్ని దోచుకోవడానికి శశికళ సిద్దంగా ఉంది. ఆమెను ఇక్కడితోనే ఆపేయాలి.

= ఒక సర్వెంట్ తమిళనాడుకు ముఖ్యమంత్రి ఎలా అవుతుంది? ఇలాంటి ముర్ఖపు పనిని నేను అంగీకరించను. దయచేసి తమిళనాడును కాపాడండి.

= ఒక సేవకురాలు నా రాష్ట్రానికి సేవ చేసేందుకు నేను అంగీకరించను. మరోసారి ఎన్నికలు నిర్వహించండి. శశికళను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోండి.

= సీఎం అయ్యే ఏ ఒక్క అర్హత కూడా శశికళకు లేదు.

= ఆమె ముఖ్యమంత్రి అయితే.. తమిళనాడు నాశనం అవుతోంది.

= ప్రధాని మోదీ ఈ విషయంలో వెంటనే కల్పించుకోవాలి. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి.. రాష్ట్రపతి పాలన విధించాలి.

= ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నా. నేను శశికళకు ఓటు వేయలేదు. ప్రజల మనసులో ఏం ఉందో తెలుసుకోవాల్సిన ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు... శశికళ మాఫియాకు తొత్తులుగా మారారు.

= రాష్ట్రంలో ఎంతో మంది మేధావులున్నారు. ఈ రాష్ట్రాన్ని మేధావులే పాలించాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/