Begin typing your search above and press return to search.

రాజకీయాల్లోకి చిన్నమ్మ రీఎంట్రీ.. తమిళనాట కొత్త సమీకరణాలు

By:  Tupaki Desk   |   17 Oct 2021 7:12 AM GMT
రాజకీయాల్లోకి చిన్నమ్మ రీఎంట్రీ.. తమిళనాట కొత్త సమీకరణాలు
X
తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారి.. తన ఎంట్రీతోనే అప్పటివరకున్న మూస రాజకీయాలకు చెక్ పెట్టిన పార్టీ అన్నాడీఎంకే. ఆ పార్టీని ఏర్పాటు చేసింది దివంగత ప్రముఖ కథానాయకుడు ఎంజీఆర్. ఈ రోజుకు యాభైఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రజాకర్షక నేత అధినేతగా ఏర్పాటు చేసిన ఆ పార్టీ.. ఆయన తర్వాత జయలలిత లాంటి బలమైన నాయకురాలి చేతికి వెళ్లేలా ఎంజీఆర్ చేసినా.. అందుకోసం ఆమె పడిన పాట్లు.. ఎదుర్కొన్న కష్టాలు.. అవమానాలు అన్ని ఇన్ని కావు. విజయం ఊరికే కాదు.. ఆ గెలుపు గమ్యస్థానం 'అధికారం' అయితే.. ఆ కష్టాలు రెట్టింపు అన్నట్లు ఉంటాయి. అందుకు దివంగత జయలలిత జీవితాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

ప్రాంతీయ పార్టీలకు ఉండే బలం.. బలహీనత.. ఆ పార్టీకి అన్ని తానై నడిపే అధినేత. కానీ.. ఒక్కసారి వారు కనుమరుగైన తర్వాత మనగలిగే పార్టీలు చాలా తక్కువగా ఉంటాయి. అన్నాడీఎంకే అలాంటి సంక్షోభాన్ని గతంలోనే ఎదుర్కొంది. అమ్మ జయలలిత కారణంగా దాన్ని త్వరగానే అధిగమించి.. విజయాన్ని సొంతం చేసుకుంది. అధికారాన్ని చేజిక్కించుకుంది.

తమిళనాట ఒక రాజకీయ పార్టీ రెండు టర్మ్ లు వరుసగా అధికారంలోకి వచ్చిన అరుదైన రికార్డు అన్నాడీఎంకేదే. అలాంటి అరుదైన రికార్డును సొంతం చేసుకున్న కొద్ది రోజులకే అనూహ్య పరిణామాల మధ్య అనారోగ్యంతో మరణించిన జయలలిత అందరికి దిమ్మ తిరిగే షాకిచ్చారు. ఇక.. అన్నాడీఎంకే అయితే చేష్టలుడిగిపోయేలా చేశారు. అయితే.. అధికారం ఆ పార్టీని మనగలిగేలా చేసింది. ఆమెకు నమ్మకస్తుడైన పన్నీరు సెల్వం కలుపుకుపోయే గుణం.. పళనిస్వామి ధిక్కారాన్ని సైతం రాజీ చేసుకొని.. చిన్నమ్మకు షాకిచ్చి పవర్ లో ఉండగలిగారు.

ఇటీవల జరిగిన ఎన్నికల వేళ.. అన్నాడీఎంకే ఓటమి పాలైంది. కాకుంటే.. దారుణం అనే మాటకు కాస్త దూరంగానే అపజయం ఉందని చెప్పాలి. అమ్మ మరణించిన తర్వాత ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవటానికి తపనపడిన శశికళకు.. జైలు తప్పలేదు. నాటకీయ రాజకీయ పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే తమిళనాడులో ఆమె ఎట్టకేలకు జైలు జీవితాన్ని పూర్తి చేసుకొని.. తిరిగి వచ్చారు. ప్రజాజీవితంలోకి వస్తున్నట్లుగా సంకేతాలు పంపి.. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందు.. తనకు రాజకీయాలు ఆసక్తి లేవని తప్పుకున్నారు.

ప్రస్తుతం తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రిగా డీఎంకే అధికారంలో ఉంది. కరుణ కుమారుడిగా.. సీఎంకుర్చీలో కూర్చోవటం కోసం దశాబ్దాల తరబడి ఓపికగా ఎదురుచూశాడు. ఇప్పుడు ఆయన రాజకీయ వారసుడు ఉదయగిరి స్టాలిన్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటిన అతను.. భవిష్యత్తు రాజకీయాలను.. సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా శిక్షణ పొందుతున్నాడు.

ఇక.. అన్నాడీఎంకే విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆ పార్టీకి చుక్కొనిగా ఉన్న పళని స్వామి.. పన్నీరు సెల్వం ఇద్దరు ప్రజాకర్షక నేతలు అయితే కాదు. కాకుంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో 75 స్థానాల్ని గెలుచుకోవటం ద్వారా.. ప్రయత్నిస్తే మరింత మెరుగైన ఫలితాల్ని సొంతం చేసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇప్పుడా పార్టీకి అవసరమైన బలమైన 'ఫేస్' మిస్ అయ్యింది. శశికళ ఆ లోటును తీర్చాలని తపిస్తున్నా.. అందుకు అన్నాడీఎంకే నాయకత్వం సుముఖంగా లేదు. అమ్మ పోయిన వేళలో.. పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన శశికళ.. మొదట్లోనే అహంభావానికిపోవటం. అత్యాశతో పార్టీ మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలన్న తపన మొదటికే మోసం వచ్చేలా చేసింది.

ఇప్పటికి ఆమెకు పార్టీని అప్పజెప్పేందుకు పన్నీరు.. పళనిలు ఇద్దరు సుముఖంగా లేరు. ఇప్పటికే పార్టీ కార్యకర్తలకు. నాయకులకు స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చి.. రాజకీయాల మీద ఆసక్తిని ప్రదర్శించి.. ఆ పై దూరమైన ఆమె మళ్లీ ఇప్పుడు పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ పెట్టి యాభై సంవత్సరాలైన సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తన నెచ్చలి సమాధాని సందర్శించని శశికళ.. శనివారం మాత్రం వెళ్లి నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా ఆమె కారు మీద పార్టీ జెండాను పోలిన గుర్తు ఉండటం ద్వారా తన మనసులోని మాటను ఆమె చేతల్లో చెప్పేశారు.

జైలుకు వెళ్లే ముందు అమ్మ సమాధి వద్దకు వచ్చి.. నివాళులు అర్పించి ఆవేశంతో ద్రోహుల్ని తాను వదిలిపెట్టనంటూ మూడుసార్లు సమాధిని చరచి.. శపధం చేయటం తెలిసిందే. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా భావోద్వేగంగా వ్యవహరించారే తప్పించి ఆవేశానికి పోకపోవటం గమనార్హం. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. భాగస్వామ్య పక్షాలతో కలిసిన డీఎంకే.. మొత్తం 153 జిల్లా పంచాయితీ వార్డుల్లో 139 స్థానాలు గెలుపొందగా.. అన్నాడీఎంకే మాత్రం రెండింటిలోనే గెలుపొందింది. ఇక.. 1421 పంచాయితీ యూనియన్ వార్డులకు డీఎంకే 977 ను సొంతం చేసుకోగా అన్నాడీఎంకే మాత్రం 212 వార్డుల్లో మాత్రమే గెలుపొందింది.

పార్టీలో ఇప్పుడున్న శూన్యతను భర్తీ చేసేందుకు తానే సరైన వ్యక్తిగా భావిస్తున్నారు శశికళ. అదే సమయంలో.. పార్టీ సైతం ఇప్పుడు బలమైన జనాకర్షక నేత కోసం చూస్తోంది. అలా అని శశికళకు జనాకర్షక శక్తి ఉందని చెప్పలేం కానీ.. అమ్మకు అత్యంత సన్నిహితురాలన్న ట్యాగ్ ఆమెకు లాభం చేస్తుందని భావిస్తున్నారు. ఇటీవల ఆమె నమదు ఎంజీఆర్ పత్రికకు భారీ ప్రకటనను విదుదల చేశారు. తాను మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానన్న విషయాన్ని ఆ యాడ్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

అంతేకాదు.. తనకు మద్దతు ఇస్తున్న కొందరు మద్దతుదారులతో చర్చలు జరిపినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా అన్నాడీఎంకేలో కొత్త సమీకరణాలు చోటు చేసుకునే దిశగా శశికళ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి.. వాటిలో ఎన్ని సక్సెస్ అవుతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సీఎం పదవిని చేపట్టిన స్టాలిన్.. పాలనలో మెరుపులు మెరిపిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడూ చూడని కొత్త పోకడలకు ఆయన తెర తీస్తున్నారు. తిరుగులేని ప్రజానేతగా ఆయన ఇమేజ్ సొంతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ.. శశికళ రీఎంట్రీ ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.