Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ‌.. మీరు జైల్లో ఉన్నార‌ని మ‌ర్చిపోవద్దు

By:  Tupaki Desk   |   20 May 2017 5:28 AM GMT
చిన్న‌మ్మ‌.. మీరు జైల్లో ఉన్నార‌ని మ‌ర్చిపోవద్దు
X
ఎక్క‌డున్నా స‌రే కొంత మంది హ‌వా అలా న‌డిచిపోతుంది. దీనికి త‌గ్గ‌ట్లే వారి మాట‌లు.. వ్య‌వ‌హారాలు ఉంటాయి. త‌ప్పు చేసి జైలుశిక్ష అనుభ‌విస్తున్న వ్య‌క్తి.. త‌న‌కేం కావాలో డిమాండ్లు చేసే ప‌రిస్థితి ఒక ఎత్తు అయితే.. ఈ డిమాండ్లు చిత్ర విచిత్రంగా ఉండ‌టం ఇప్పుడు అంద‌రిని అవాక్కు అయ్యేలా చేస్తోంది.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా నిరూపిత‌మైన చిన్న‌మ్మ ప్ర‌స్తుతం ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. జైలుకు వెళ్లే ముందే.. త‌న‌కేం వ‌స‌తులు కావాలో చిట్టా చెప్పిన చిన్న‌మ్మ మాట‌ల్ని కోర్టు తోసిపుచ్చ‌ట‌మే కాదు.. సాధార‌ణ ఖైదీగానే ఆమెను ట్రీట్ చేయాల‌ని స్ప‌ష్టం చేయ‌టం తెలిసిందే.

మొద‌ట్లో రూల్స్ ను క‌ఠినంగా అమ‌లు చేసిన‌ప్ప‌టికీ.. త‌ర్వాత త‌ర్వాత చిన్న‌మ్మ కోరుకున్న వ‌స‌తులు ఒక్కొక్క‌టిగా అందిస్తున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా శ‌శిక‌ళ నోటి నుంచి వ‌చ్చిన కొత్త డిమాండ్లు ఆశ్చ‌ర్యాన్ని పెంచేలా ఉన్నాయి. అక్ర‌మాస్తుల కేసుకు సంబంధించి ఈడీ అధికారులు త‌న‌ను ప్ర‌శ్నించాల‌నుకున్న ప్ర‌శ్న‌ల్ని ముందుగా త‌న‌కు తెలియ‌జేయాల‌ని శ‌శిక‌ళ స్ప‌ష్టం చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఏదో నోటి మాట‌కు అన్న‌ట్లు కాకుండా.. ఇదే విష‌యాన్ని ఆమె ఎగ్మూరు న్యాయ‌స్థానంలో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. విచార‌ణ‌లో భాగంగా ఈడీ అడ‌గాల‌నుకునే ప్ర‌శ్న‌ల్ని తొలుత త‌న‌కు ఇవ్వాల‌ని.. త‌ర్వాతే త‌న‌ను ప్ర‌శ్నించాలంటూ ఆమె న్యాయ‌స్థానాన్ని అభ్య‌ర్థించారు. దీనిపై ఈడీ త‌ర‌ఫు న్యాయ‌వాది అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. శ‌శిక‌ళ అడిగిన‌ట్లు కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పారు.

అక్ర‌మాస్తుల కేసులో శ‌శిక‌ళ వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు కోర్టు ఎదుట హాజ‌రు కావాల‌ని న్యాయ‌స్థానం ఆదేశించ‌గా.. త‌న ఆరోగ్యం స‌రిగా లేదని.. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వాంగ్మూలాన్ని ఇచ్చేలా అవ‌కాశం ఇవ్వాల‌ని శ‌శిక‌ళ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టును కోరారు. ఈడీ అడ‌గాల‌నుకునే ప్ర‌శ్న‌ల్ని ముందుగా ఇచ్చేసే స‌దుపాయాన్ని శ‌శిక‌ళ త‌ప్ప మ‌రెవ‌రూ కోర‌రేమోన‌న్న ఎద్దేవా ప‌లువురు వ్య‌క్తం చేయ‌టం క‌నిపిస్తోంది. ఇది ఆమె నాలెడ్జి ఏ స్థాయిలో ఉందో చెప్ప‌డానికి ఉదాహ‌ర‌ణ కూడా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/