Begin typing your search above and press return to search.

‘చిన్నమ్మకు జైలు’ సంకేతాన్నిచ్చిన గుడి

By:  Tupaki Desk   |   16 Feb 2017 8:14 AM GMT
‘చిన్నమ్మకు జైలు’ సంకేతాన్నిచ్చిన గుడి
X
వింతలకు.. విచిత్రాలకు భారతావనిలో కొదవు ఉండదు. కొందరు మూఢ నమ్మకాలుగా కొట్టేస్తారు కానీ.. ఈ కర్మభూమిలో అంతుచిక్కని విషయాలెన్నో. డిజిటల్ ప్రపంచంలోనూ ‘ఎందుకిలా?’ అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేనివి భారతదేశంలోఎన్నో కనిపిస్తాయి. ఇక.. తమిళనాడు విషయానికి వస్తే ఈ మోతాదు కాస్త ఎక్కువే. అధ్యాత్మికతతో పాటు.. స్వాములోరు.. జ్యోతిష్యులకు ఇక్కడ కొదవ ఉండదు. ఇప్పుడు చెప్పే విషయాన్ని విడిగా చెబితే దీన్నోమూఢ నమ్మకంగా కొట్టిపారేసే వాళ్లు చాలామందే ఉంటారు. కానీ.. ఇప్పుడైతే నమ్మక తప్పనిసరి. చిన్నమ్మకు జైలు తప్పదన్న విషయాన్ని సంకేతంగా కొద్ది రోజుల ముందే.. ఒక గుడి చెప్పేసిందన్న విషయం ఇప్పుడు ఆసక్తిగా మారటమే కాదు.. ఆ గుడి మహత్తు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ గుడి ఎక్కడుంది? భవిష్యత్తులో జరిగే విషయాల్ని ఎలా చెబుతుంది అన్నది చూస్తే..

తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో గాంగేయం శివనమలైలో సుబ్రమణ్య స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయంలోని ఒక పెట్టెను ఉత్తర్వుల పెట్టగా చెబుతారు. ఎవరైనా భక్తులకు కల వచ్చి.. ఈ గుడిలోని ఉత్తర్వుల పెట్టెలో ఏదైనా వస్తువును పెట్టాలని ఆదేశిస్తారు. అలా కల వచ్చిన వారు గుడికి వచ్చి తమ కలలో కనిపించిన వస్తువు గురించి ఆలయ అధికారులకు చెబుతారు. ఆ ఉత్తర్వుల్నిఖరారు చేసేందుకు దేవుడి ముందు పుష్పాన్నిపెట్టి.. అనుమతి పొందిన తర్వాత.. సదరు వస్తువును పెట్టెలో ఉంచుతారు.

మళ్లీ ఎవరికైనా కల వచ్చి.. వస్తువు పేరుచెప్పే వరకూ.. పాత వస్తువునే పూజలు చేస్తుంటారు. భగవంతుని పెట్టెలా భావించే ఈ పెట్టెలో గతంలో తుపాకీ ఉంచిన సమయంలో చైనాతో యుద్ధం.. నీళ్లను ఉంచినప్పుడు సునామీ లాంటివి చోటు చేసుకున్నాయి. గత జనవరి 10 నుంచి పెట్టెలో ఇనుప గొలుసు ఉంచి పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిన్నమ్మ శశికళతో సహా మరో ముగ్గురికి జైలుశిక్ష ఖరారు చేస్తూ సుప్రీం ఉత్తర్వులు జారీ చేయటం గమనార్హం. సుప్రీం తీర్పును ముందుగానే తెలియజేసేలా శివనమలై అండవర్ ఇనుప గొలుసును ఉంచి పూజించాలని భక్తులకు ఆదేశించినట్లుగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/