Begin typing your search above and press return to search.

పన్నీరుకు కౌంట్ డౌన్ మొదలైంది

By:  Tupaki Desk   |   3 Jan 2017 5:15 AM GMT
పన్నీరుకు కౌంట్ డౌన్ మొదలైంది
X
తమిళనాడు రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. అమ్మ స్థానాన్ని భర్తీ చేయటానికి చిన్నమ్మ కదుపుతున్న పావులతో గంట.. గంటకూ పరిస్థితులు మారిపోతున్నాయి. అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టేందుకు కాస్త వెయిట్ చేసిన చిన్నమ్మ.. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత మాత్రం..సీఎం కుర్చీలో కూర్చునేందుకు తెగ తహతహలాడిపోతున్నారు.

అదే సమయంలో పలువురు మంత్రులు సైతం చిన్నమ్మను సీఎం కుర్చీలో కూర్చుంటే చూడాలన్న విషయాన్ని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. అంతేకాదు.. చిన్నమ్మ పోస్టర్లను తమిళనాడు వ్యాప్తంగా అతికిస్తూ..అమ్మను భర్తీ చేసేది చిన్నమ్మ మాత్రమే అన్న భావన కలిగేలా చేస్తున్నారు. అంతేకాదు.. మంత్రులు సైతం సీఎం కుర్చీలో శశికళను కూర్చోవాలంటూ చేస్తున్న ప్రకటనలు జోరందుకున్నాయి. అమ్మ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లటానికి చిన్నమ్మే సరైన వ్యక్తి అని.. ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే బాగుంటుందని బహిరంగంగా చెప్పేస్తున్నారు.

మంత్రులే కాదు.. లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరిస్తున్న తంబిదురై సైతం.. చిన్నమ్మ సీఎం పగ్గాలు చేపట్టాలన్న విషయాన్ని ప్రకటన రూపంలో వెల్లడించారు. శశికళకు మద్దుతు ఇస్తున్న మంత్రుల సంఖ్యసైతం అంతకంతకూ పెరుగుతోంది.తొలుత ఒకరిద్దరు మంత్రులు ఓపెన్ అయినప్పటికీ.. సోమవారం రాత్రికి ఈ మంత్రుల సంఖ్య పదిహేడుకు చేరుకోవటం గమనార్హం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. సోమవారం సాయంత్రం పదిహేడు మంత్రులు పోయెస్ గార్డెన్ కు వెళ్లి చిన్నమ్మతో అత్యవసరంగా భేటీ కావటం చూస్తుంటే.. విధేయుడి కుర్చీ కిందకు నీళ్లు వచ్చేసినట్లేనని చెప్పక తప్పదు. ఇంతకాలం అమ్మకు.. చిన్నమ్మకు అత్యంత విధేయుడిగా వ్యవహరించిన పన్నీరు సెల్వం.. ఇప్పుడు అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి పదవిని వదులుకోవటానికి సిద్ధంగా లేనన్నవిషయాన్ని శశికళకు చెప్పినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ వాదన మీద పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయాలంటే కనీసం ఐదేళ్ల పాటు పార్టీ సభ్యులుగా ఉండాలని.. శశికళ పార్టీ సభ్యురాలే కాదని వాదిస్తున్నఅన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ పుష్పకళ మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు చేపట్టిన కోర్టు.. పిటీషన్ ను కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/