Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల కాపలాలో ‘పీ2’ కూటమి

By:  Tupaki Desk   |   7 Oct 2017 4:25 AM GMT
ఎమ్మెల్యేల కాపలాలో ‘పీ2’ కూటమి
X
తమిళనాడులో రాజకీయాలు మరో అయిదు రోజుల పాటూ ఎన్ని మలుపులు తిరగడానికైనా అవకాశం ఉంది. ఎందుకంటే చిన్నమ్మ బయటకు వచ్చింది. జయలలిత నెచ్చెలి, అన్నా డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ.. అనారోగ్యంతో ఉన్న భర్తను కలవడానికి అయిదు రోజుల పెరోల్ పై బయటకు వచ్చారు. అయితే ఈ అయిదు రోజుల్లోనే ఆమె తమిళనాట రాజకీయాలను మలుపు తిప్పినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి పాలకపక్షమైన అన్నడీఎంకే పళని-పన్నీర్ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవ్వరూ కట్టుతప్పి పోకుండా.. చిన్నమ్మ వైపు మొగ్గకుండా కాపలా కాసుకోవడంలో అక్కడి అధినేతలు బిజీగా ఉన్నారు.

క్యాంపు రాజకీయాలు నిర్వహించడాన్ని శశికళ తారస్థాయికి తీసుకువెళ్లిన సంగతి అందరికీ తెలుసు. వారాల తరబడి.. ఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహించి.. ఆమె పార్టీ మీద పట్టు సంపాదించుకున్నారు. ఆ సందర్భంగానే ఎమ్మెల్యేలు అందరికీ పలు ప్రలోభాలు పెట్టినట్లుగా కూడా పుకార్లు వచ్చాయి. అయినా.. పార్టీ గుర్తు రెండాకులను పొందడానికి 60 కోట్లు ఇవ్వజూపిన శశికళ మేనల్లుడు దినకరన్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి ఎన్ని కొత్త మార్గాలు వెతికినా వింతేమీ కాదు. ఎన్ని చేసినా శశికళ జైల్లో ఉన్న సమయంలో కేవలం 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే దినకరన్ వెంట ఉన్నారు. వారిమీద అన్నాడీఎంకే ఫిర్యాదుతో స్పీకరు అనర్హత వేటు వేశారు కూడా.

అయితే ఇప్పుడు చిన్నమ్మ బయటకు వచ్చాక పళని-పన్నీర్ కూటమిలో ఉన్న మరికొందరు ఎమ్మెల్యేల మీద కూడా ఫోకస్ పెట్టగలదనే ప్రచారం నడుస్తోంది. నిజానికి ఆమె విడుదలకు కోర్టు అనేక ఆంక్షలు విధించింది. రాజకీయ కార్యక్రమాలకు వెళ్లకూడదు, మీడియా ప్రకటనలు చేయకూడదు - బంధువుల ఇళ్లలోనే ఉండాలి, ఎవ్వరినీ కలవకూడదు అని నిబంధనలు పెట్టారు.

కానీ ఆమె విడుదల సమయానికి మేనల్లుడు దినకరన్ సహా అనుచరులు అనేకమంది తరలివచ్చారు. జైలునుంచి చెన్నై చేరేలోగానే ఆమె కారులోనే అనేక రాజకీయ ఆంతరంగిక సమావేశాలు మార్గదర్శనాలు పూర్తిచేసి ఉంటారని కూడా పలువురు అనుకుంటున్నారు. ఆమె బంధువుల ఇంటిలోనే ఈ అయిదురోజులు ఉండవచ్చు గాక.. కానీ.. అక్కడినుంచే వ్యవహారాలు నడిపి పళని-పన్నీర్ ప్రభుత్వం కూలిపోవడానికి పావులు కదపదనే గ్యారంటీ ఏమీ లేదు. అందుకే తమ పార్టీలోని వారు చిన్నమ్మను కలవకుండా, ఆమె కొత్తగా పెట్టబోయే ప్రలోభాలకు లొంగకుండా ఈ కూటమి జాగ్రత్తలు తీసుకుంటున్నదట. శశికళ ను నమ్ముకుంటే భవిష్యత్తు ఉండదని.. తాత్కాలిక ప్రలోభాల కోసం, అయిదురోజుల పెరోల్ పై వచ్చిన ఆమె మాటలు నమ్మితే మునిగిపోతారని తమ వారిని హెచ్చరించుకుంటున్నట్లుగా చెన్నై వర్గాల ద్వారా తెలుస్తోంది.