Begin typing your search above and press return to search.

జైల్లో చిన్నమ్మ వైభోగం మామూలుగా ఉండదట!

By:  Tupaki Desk   |   10 Oct 2019 5:51 AM GMT
జైల్లో చిన్నమ్మ వైభోగం మామూలుగా ఉండదట!
X
విన్నంతనే విస్మయానికి రేకెత్తించే అంశాలు బయటకు వచ్చాయి. అక్రమాస్తుల కేసులో జైలు జీవితాన్ని గడుపుతున్న చిన్నమ్మ అలియాస్ దివంగత అమ్మ నెచ్చెలి శశికళ వైభోగం మరోసారి బయటకు వచ్చింది. జైల్లో ఖైదీగా ఉన్న చిన్నమ్మకు అందుతున్న రాజభోగాల గురించి తెలిస్తే.. బయట ఉన్నాఇలాంటి అవకాశం ఉండదేమో?

జైల్లోకి వెళ్లిన మొదటి రెండు మూడు రోజులు ముభావంగా ఉండటం.. సరిగా ఆహారం తీసుకోకపోవటం.. నిద్ర పోవటానికి సైతం ఇబ్బందికి గురి కావటం లాంటి వార్తలు రావటం.. అయ్యో.. ఎంతటి చిన్నమ్మకు ఎలాంటి కష్టాలు వచ్చాయో అన్న సానుభూతి కొందరిలో వ్యక్తమైంది. అయితే.. అలాంటి పరిస్థితి కొద్ది రోజులేనని.. జైల్లోకి అడుగు పెట్టిన తర్వాత.. జైల్లో కల్పించే సౌకర్యాల్ని తనకు అనుకూలంగా మార్చేసుకోవటంలో చిన్నమ్మ సక్సెస్ అయ్యారంటున్నారు.

పరప్పన అగ్రహార జైల్లో శశికళ కోసం ప్రత్యేకంగా ఐదు గదుల్ని ఏర్పాటు చేయటం.. విలాసవంతమైన పరుపుల్ని.. వంటగది తదితర సౌకర్యాల్ని కల్పించిన వైనాన్ని తాజాగా ఏర్పాటు చేసిన కమిటీ ఆకస్మిక తనిఖీలో గుర్తించారు. జైల్లో ఉన్న చిన్నమ్మ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న వైనంపై జైళ్ల శాఖ మాజీ డీజీపీ రూప సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. అంతేకాదు.. జైలు అధికారులు తన మాటను వినేందుకు వీలుగా ఆమె రూ.2కోట్ల మొత్తాన్ని ముడుపులుగా చెల్లించినట్లుగా విచారణలో తేలింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. జైల్లో ఉన్న చిన్నమ్మ అప్పుడప్పుడు చుడీదార్ వేసుకొని బెంగళూరు మహానగరంలో సరదాగా షాపింగ్ చేసుకొని వచ్చే తీరుకు సంబంధించిన వీడియో ఇప్పుడు విస్తుపోయేలా చేస్తోంది. ముడుపులు తీసుకొని జైలుశాఖ అధికారులు శశికళకు కల్పించిన వసతులు.. సౌకర్యాల మీద ప్రత్యేక నివేదికను రూపొందించారు. జైలు జీవితాన్ని నిబంధనలకు విరుద్ధంగా గడిపిన నేపథ్యంలో ఆమె జైలు జీవితాన్ని మరికొంత కాలం పొడిగించేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు. చూస్తుంటే.. చిన్నమ్మను వీలైనంత ఎక్కువ కాలం జైల్లో ఉండే ఏర్పాట్లు జరుగుతున్నట్లున్నాయి. దీనికి చిన్నమ్మ కూడా తనకు చేతనైనంత ఎక్కువగా సహకరిస్తున్నట్లుందే? ఏమైనా అమ్మ ఎప్పటికి చిన్నమ్మ కాలేదని ఊరికే అనలేదేమో?