Begin typing your search above and press return to search.

బలపరీక్షను చిన్నమ్మ జైల్లో చూశారా?

By:  Tupaki Desk   |   18 Feb 2017 7:38 PM IST
బలపరీక్షను చిన్నమ్మ జైల్లో చూశారా?
X
మూడు రోజుల క్రితం చిన్నమ్మ ఏదైతే స్కెచ్ ను ఫైనల్ చేసి వెళ్లారో.. అదే స్కెచ్ ను యథాతధంగా అచ్చుగుద్దినట్లుగా అమలు చేసి చూపించారు ఆమె వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు. చిన్నమ్మ మీద ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని.. పన్నీర్ పట్ల సానుభూతితో ఉన్నారన్న సమాచారం మీడియా ద్వారా బయటకు వచ్చినా.. చిన్నమ్మ వర్గం ఎమ్మెల్యేలు కట్టు దాటేందుకు ఏ మాత్రం ఆసక్తిని ప్రదర్శించలేదు.

మొదటి నుంచి చెప్పినట్లే.. తమకున్న 122 మంది ఎమ్మెల్యేల మద్దుతును అసెంబ్లీలో ప్రదర్శించారు. అమ్మ లేకుండా.. తనకు తాను సొంతంగా ఇంత కథ నడిపించటం చూసినప్పుడు చిన్నమ్మ బలం ఏపాటిదన్న విషయం అర్థం కావటమే కాదు.. అన్నాడీఎంకేలో ఆమెకున్న బలం ఎంతన్న విషయంపై స్పష్టత రావటం ఖాయం.

మరి.. తాను రచించిన బలపరీక్ష వ్యూహాన్ని జైల్లో ఉన్నచిన్నమ్మ చూసిందా? అన్నదిఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పరప్పన అగ్రహార జైల్లో ఉన్న చిన్నమ్మ.. బలనిరూపణ పరీక్షను టీవీలో లైవ్ ను చూసినట్లుగా తెలుస్తోంది. వీఐపీ ఖైదీ కానందున.. ఆమె ఉన్న జైలు గదిలో టీవీ సౌకర్యం లేదు. బలనిరూపణ నేపథ్యంలో తన రూమ్ లో టీవీ పెట్టాలన్న సూచనను అధికారులు తిరస్కరించారట.

దీంతో.. దగ్గర్లో ఉన్న వీఐపీ సెల్ లోని టీవీ ద్వారా బలనిరూపణ పరీక్షను నలభైనిమిషాల పాటు వీక్షించినట్లుగా చెబుతున్నారు. బలపరీక్ష తర్వాత అధికారులు ఛానల్ మార్చి టీవీ సీరియల్ పెడితే.. దాన్ని చూస్తూ ఉండిపోయారట. మొత్తానికి తను రచించిన వ్యూహాన్ని తన వర్గ ఎమ్మెల్యేలు ఎలా అమలు చేశారన్నది లైవ్ ద్వారా చిన్నమ్మ చూశారన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/