Begin typing your search above and press return to search.

చిన్నమ్మ శశికళకు విడుదల?

By:  Tupaki Desk   |   2 Dec 2020 2:45 PM GMT
చిన్నమ్మ శశికళకు విడుదల?
X
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. జయలలిత నెచ్చలి శశికళ విడుదల ఒకే సమయంలో జరగబోతోంది. వచ్చే సంవత్సరం జనవరిలో అక్రమాస్తుల కేసులో జైలుపాలైన శశికళ విడుదల అవుతోందని తెలుస్తోంది. ఆ తర్వాత మార్చిలో తమిళనాడు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు చిన్నమ్మ శశికళ ఇప్పటి నుంచే జైల్లోనే వ్యూహరచన చేస్తున్నట్టు తెలిసింది. తాజాగా న్యాయనిపుణులతో చర్చించి కేవియేట్ పిటీషన్ దాఖలు చేసేందుకు ఆమె ప్రతినిధులు నిమగ్నమయ్యారు.

బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న శశికళ.. కోర్టులో ఇప్పటికే రూ.10 కోట్ల సొంత పూచీకత్తు చెల్లించారు. ఈ క్రమంలోనే ఆమె విడుదలకు కోర్టులో లైన్ క్లియర్ అయ్యిందని.. జనవరి 27న విడుదల అవుతున్నట్లు వార్తలు వస్తున్నారు.

ఇక శశికళ తన శిక్షా కాలాన్ని తగ్గించాలని కూడా జైలు అధికారులకు ఇటీవల దరఖాస్తు చేసుకుంది. ఇది ఉన్నతాధికారుల పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది.

జనవరిలో విడుదల అవుతున్న శశికళ ఇటీవలే తన న్యాయవాది రాజా చెందూర్ పాండియన్ కు రాసిన లేఖ వెలుగుచూసింది. సుప్రీం కోర్టులో ఆమె తరుఫున కేవియట్ దాఖలుకు కసరత్తు చేయాలని అందులో ఉంది. శిక్ష పడడంతో నాలుగేళ్లు జైలులో ఉన్న శశికళకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేదు. దీంతో తనకు విధించిన శిక్షకు వ్యతిరేకంగా కేవియేట్ పిటీషన్ దాఖలు చేయాలని ఆమె తన లాయర్లను కోరారు. పిటీషన్ దాఖలుతో ఎన్నికల్లో పోటీచేసేందుకు తగిన వ్యూహాలకు చిన్నమ్మ వ్యూహం పన్నుతున్నట్టు తెలిసింది.