Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ కోపం కంప్లైంట్ గా ఈసీకి చేరింది

By:  Tupaki Desk   |   25 Oct 2017 5:52 AM GMT
చిన్న‌మ్మ కోపం కంప్లైంట్ గా ఈసీకి చేరింది
X
కాలం క‌లిసి రాన‌ప్పుడు మౌనానికి మించింది మరొక‌టి ఉండ‌దు. అదును చూసి త‌న‌ను దెబ్బేస్తున్న వారికి స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితుల్లో ఉన్న అన్నాడీఎంకే చిన్న‌మ్మ‌.. అమ్మ నెచ్చెలి శ‌శిక‌ళ తాజాగా త‌న‌లో బ‌ద్ధ‌ల‌వుతున్న అగ్నిప‌ర్వ‌తాల వేడిని బ‌య‌ట‌కు ప్ర‌ద‌ర్శించే ప్ర‌య‌త్నం చేశారు. అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత అన్నాడీఎంకేకు తిరుగులేని అధినేత్రిగా మారిన ఆమె.. అత్యాశ‌తో సీఎం కుర్చీని టార్గెట్ చేయ‌టంతో అమ్మ‌కు వీర విధేయుడైన ప‌న్నీర్ సెల్వం చిన్న‌మ్మ‌కు షాకిస్తే.. ఆయ‌న స్థానానికి ఎడ‌పాడిని ఎంపిక చేశారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుశిక్ష నేప‌థ్యంలో జైల్లో ఉన్న వేళ‌.. చిన్న‌మ్మ‌కు హ్యాండిచ్చిన ఎడ‌పాడిపై ఆమె ర‌గిలిపోతున్నారు. ఏం చేయాల‌న్నా ప‌రిస్థితులు త‌న‌కు అనుక‌కూలంగా లేవ‌న్న విష‌యాన్ని గుర్తించిన చిన్న‌మ్మ కామ్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకే పార్టీ గుర్తు అయిన రెండాకుల్ని సొంతం చేసుకునేందుకు చిన్న‌మ్మతో పాటు.. ఆమె వైరి వ‌ర్గ‌మైన ప‌న్నీర్‌.. ప‌ళ‌నిస్వాములు జోరుగా ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అమ్మ మ‌ర‌ణంతో జ‌ర‌గాల్సిన ఉప ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకే పార్టీ గుర్తు అయిన రెండాకుల్ని సొంతం చేసుకునేందుకు చిన్న‌మ్మ బంధువు దిన‌క‌ర‌న్ అక్ర‌మ మార్గంలో ప్ర‌య‌త్నించ‌టం.. అది కాస్తా బ‌య‌ట‌కు వ‌చ్చి కేసుగా మార‌టం తెలిసిన ముచ్చ‌ట్లే.

ఇదిలా ఉంటే.. రెండాకుల్ని ఎవ‌రికి సొంతం చేయాల‌న్న దానిపై అటు చిన్న‌మ్మ‌.. ఇటు ప‌ళ‌ని..ప‌న్నీర్ ద్వ‌యం ప్ర‌య‌త్నిస్తున్న వేళ‌.. ఈ అంశంపై తుది తీర్పు ఇచ్చేందుకు ఈసీ ఈనెల 30 తేదీని డిసైడ్ చేసింది. రెండాకుల్ని సొంతం చేసుకునేందుకు పార్టీ నేత‌లు.. ఎంపీలు.. ఎమ్మెల్యేల బ‌లం త‌మ‌కే ఎక్కువ‌గా ఉందంటూ ప‌ళ‌ని.. ప‌న్నీర్ లు సంత‌కాల కార్య‌క్ర‌మాన్ని షురూ చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రెండాకుల గుర్తును మిస్ అయితే త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు దారుణ‌మైన దెబ్బ త‌గులుతుంద‌న్న విష‌యాన్ని గుర్తించిన చిన్న‌మ్మ తాజాగా రియాక్ట్ అయ్యారు.

సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మంలో భాగంగా సంత‌కాలు చేస్తున్న‌ట్లు చెబుతున్న వారి సంత‌కాలు నిజం కావ‌ని.. ఫోర్జ‌రీకి పాల్ప‌డుతున్న‌ట్లుగా చిన్న‌మ్మ తాజాగా ఈసీకి కంప్లైంట్ చేశారు.

చిన్న‌మ్మ తాజా రియాక్ష‌న్ చూస్తుంటే.. రెండాకుల్ని వ‌దులుకునేందుకు ఆమె ఏ మాత్రం సిద్ధంగా లేర‌న్న విష‌యంతో పాటు.. దీనిపై ఈసీ తేల్చ‌కుండా ఈ వ్య‌వ‌హారాన్ని మ‌రికొంత‌కాలం నానేలా అడ్డుపుల్ల‌లు వేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ప‌న్నీర్‌.. ప‌ళ‌నిల‌పై ఎంత కోపం ఉన్నా ఏం మాట్లాడ‌ని శ‌శిక‌ళ.. తాజాగా మాత్రం ఈసీకి ఫిర్యాదు చేయ‌టం చూస్తే.. రెండాకుల్ని వ‌దులుకునేందుకు ఆమె ఏ మాత్రం సిద్ధంగా లేర‌న్న‌ట్లుగా తేలుతుంది. ఈసీకి చిన్న‌మ్మ తాజా పంపిన ఫిర్యాదుపై ఎలా రియాక్ట్ అవుతారు? ఈ నెల 30న రెండాకుల గుర్తు ఎవ‌ర‌న్న విష‌యాన్ని ఈసీ తేలుస్తుందా? లేక‌.. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో మ‌ళ్లీ వాయిదా వేస్తుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌లుగా మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.