Begin typing your search above and press return to search.

అమ్మ‌ను చిన్న‌మ్మ‌లోనే చూసుకోవాల‌ట‌!

By:  Tupaki Desk   |   13 Aug 2017 8:10 AM GMT
అమ్మ‌ను చిన్న‌మ్మ‌లోనే చూసుకోవాల‌ట‌!
X
త‌మిళ‌నాట ఇప్పుడు ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయం న‌డుస్తోంది. దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత హ‌ఠాన్మ‌ర‌ణం నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకే కుక్క‌లు చింపిన విస్త‌రి చందంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. జ‌య బతికున్నంత కాలం పార్టీ నేత‌లంతా ఒక్క‌తాటిపై న‌డ‌వ‌క త‌ప్ప‌లేదు. ఏ ఒక్క‌రు కూడా పార్టీ అధిష్ఠానం గీసిన ల‌క్ష్మ‌ణ రేఖ‌ను దాటేందుకు య‌త్నించలేదు. అయితే త‌మిళ తంబీలంతా అమ్మగా ఆప్యాయంగా పిలుచుకునే జ‌య మ‌ర‌ణించ‌గానే... అన్నాడీఎంకేలో గ్రూపు రాజ‌కీయాలు మొద‌లైపోయాయి. జ‌య మేన‌కోడ‌లుగా అన్నాడీఎంకే త‌న‌దేనంటూ ఓ వైపు దీప ఆందోళ‌న చేస్తుండ‌గానే... అప్ప‌టిదాకా సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన ఓ ప‌న్నీర్ సెల్వం చేత రాజీనామా చేయించిన జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ‌... త‌న న‌మ్మిన‌బంటుగా ఉన్న ఎడ‌ప్పాడి ప‌ళ‌నిసామిని పీఠ‌మెక్కించేసింది.

పార్టీ ప‌గ్గాల‌ను కూడా త‌న చేతుల్లోకి తీసుకున్న శ‌శిక‌ళ‌... పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని తానేనంటూ ప్ర‌క‌టించుకుంది. అయితే విధి ఆడిన వింత నాట‌కంలో శ‌శిక‌ళ జైలులోకి వెళ్ల‌గా... పార్టీని చూసుకోమ్మంటూ ఆమె బాధ్య‌త‌లు అప్ప‌గించిన ఆమె అల్లుడు టీవీవీ దిన‌క‌ర‌న్‌.. ఇప్పుడు పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌య్యారు. ఈ ప‌రిస్థితుల‌న్నింటినీ చాలా ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్న బీజేపీ చ‌క్రం తిప్పేందుకు రంగంలోకి దిగిపోయింద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే రెండు వ‌ర్గాలుగా ఉన్న ఓపీఎస్‌ - ఈపీఎస్ వ‌ర్గాల‌ను క‌లిపేసి త‌మిళ‌నాట ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్ద‌డంతో పాటు ప‌రిస్థితుల‌ను త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకునే దిశ‌గా బీజేపీ య‌త్నాలు చేస్తున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో బెంగ‌ళూరులోని ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైలులో ఊచ‌లు లెక్కిస్తున్న శ‌శిక‌ళ‌... పార్టీ త‌న చేతుల్లో నుంచి వెళ్లిపోకుండా ఉండేందుకు చివ‌రి అస్త్రంగా ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు.

పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి శశిక‌ళ విడుద‌ల చేసిన స‌ద‌రు లేఖ‌ను అన్నాడీఎంకే ప‌త్రిక అచ్చు గుద్దేసింది. ఈ లేఖలో పార్టీ కార్య‌కర్త‌ల సానుభూతిని పొందేందుకే ప్రాధాన్యం ఇచ్చిన శ‌శిక‌ళ‌... చాలా విష‌యాల‌నే పేర్కొన్నారు. మీరంతా అమ్మ‌గా కొలిచే జ‌య‌ల‌లిత‌ను త‌న‌లోనే చూసుకోవాలంటూ త‌మిళ‌నాడు స్టైల్లో ఆమె పండించిన క‌రుణ ర‌సం ఎలా వ‌ర్క‌వుట‌వుతుంద‌న్న విష‌యం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింద‌నే చెప్పాలి. అయినా ఆ లేఖ‌లో శ‌శిక‌ళ ఏం రాశారన్న విష‌యానికి వ‌స్తే... తనలో అమ్మ(జయలలిత)ను చూసుకోవాలని ఆమె కార్యకర్తలకు సూచించారు. విపక్షం నుంచి పార్టీని, తమిళనాడును కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీని బలహీనపరిచేందుకు ప్రత్యర్థులు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ప్రతినబూనాలని ఆమె కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. దేశంలో మూడో అతిపెద్ద పార్టీ అయిన ఏఐఏడీఎంకేను కాపాడుకునేందుకు ప్రజాజీవితంలో కొనసాగాలని తాను నిర్ణయించుకున్నట్టు ఆమె పేర్కొన్నారు.