Begin typing your search above and press return to search.

మోడీషా రాజకీయాలకు చెంపదెబ్బ 'సతారా'

By:  Tupaki Desk   |   24 Oct 2019 11:35 AM GMT
మోడీషా రాజకీయాలకు చెంపదెబ్బ సతారా
X
చెప్పే నీతులకు.. చేసే చేతలకు ఏ మాత్రం పోలిక లేని రాజకీయ నేతలకు అప్పుడప్పుడు ప్రజలు బుద్ధి చెబుతుంటారు. మోడీ మాటల్లో కనిపించే కమ్మదనం.. చేతల్లో అస్సలు కనిపించదు. అధికారంలో ఉన్నప్పుడు.. అన్ని తనకు అనుకూలంగా ఉన్నప్పుడు కనిపించే మేనేజ్ మెంట్ గురు.. పవర్ చేజారే పరిస్థితే వస్తే.. దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించటం అలవాటే. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రభుత్వాన్ని సైతం పణంగా పెట్టిన వాజ్ పేయ్ కాలం నాటి బీజేపీకి.. ఇప్పటికి పోలికే లేదని చెప్పాలి.

మోడీషాల కనుసన్నల్లో నడుస్తున్న బీజేపీకి ఉండాల్సిన అన్ని అవలక్షణాలు ఉన్నాయని చెప్పాలి. తమ బలాన్ని పెంచుకోవటం కోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి వాటికి ఊహించని రీతిలో షాకిచ్చారు సతారా ప్రజలు. మహారాష్ట్రకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించినా.. ఆ ఆనందం పెద్దగా లేకుండా తీర్పు ఇచ్చారు మరాఠాలు.

మహారాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా పెద్ద విషయం కాదు కానీ.. సతారా ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక ఆ పార్టీకి చాలా కీలకంగా కొందరు చెప్పటాన్ని మర్చిపోకూడదు. ఎందుకలా అంటే.. ఆ ఎన్నికకు ఉన్న ప్రాధాన్యత అలాంటిది మరి. సతారా ఎంపీ స్థానాన్ని ఎన్సీపీ ఎంపీ ఉదయన్ రాజే బోసలే గెలుపొందారు. పార్టీ మారిన ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

2009 నుంచి 2019 వరకూ ఎన్సీపీ తరఫున గెలిచిన భోసలే.. అధికారంలో ఉన్న బీజేపీలోకి చేరారు. తనకు తిరుగు లేదని.. రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఆదరణ కారణంగా తన గెలుపుకు ఎలాంటి అవరోధం ఉండదని భావించారు. కేవలం అధికార దాహంతో పార్టీ మారిన ఆయన్ను సతారా ఓటర్లు తిప్పి కొట్టారు. స్వార్థం కోసం పార్టీ మారిన అతనికి ఓటమి శిక్ష వేయటమే కాదు.. ఇలాంటి పనులు చేస్తే మీకు కూడా అంతే సంగతులంటూ ఎన్సీపీ అభ్యర్థి కమ్ శరద్ పవార్ స్నేహితుడు శ్రీనివాస్ పాటిల్ ను గెలిపించే దిశగా ఓట్ల లెక్కింపు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
కడపటి వార్తలు ప్రకారం దాదాపు 90వేల మెజార్టీతో ఉన్న ఆయన గెలుపు ఖరారైనట్లే.

ఎన్సీపీలో సుదీర్ఘ కాలం ఉండి.. అధికారపక్షంలో భాగస్వామ్యపక్షమయ్యేందుకు పార్టీ మారిన ఆయనకు.. ఆయన్ను పార్టీలో తీసుకొని స్వార్థ రాజకీయాలకు తెర తీసిన మోడీషాలకు సతారా ఓటర్లు దిమ్మ తిరిగే షాకిచ్చారని చెప్పక తప్పదు.